ఐదేళ్ల బాలికపై హత్యాచారం, గంటల వ్యవధిలోనే నిందితుడి ఎన్‌కౌంటర్
కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఐదేళ్ల చిన్నారిపై అపహరించి హత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు గంటల వ్యవధిలోనే ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఘటనలో పోలీసులు కూడా గాయపడినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని బీహార్‌లోని పాట్నాకు చెందిన నితేశ్ కుమార్ (35)గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హుబ్బళ్లిలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ ఐదేళ్ల చిన్నారిని నిందితుడు అక్కడ్నుంచి ఎత్తుకెళ్లాడు. ఆమె కనిపించకపోవడంతో గాలించగా.. ఓ భవనంలోని బాత్‌రూంలో కనిపించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు. నిందితుడు చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన తర్వాత.. ఆమెను హత్య చేసినట్లు అభియోగాలున్నాయి. బాలికకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు.
మరోవైపు, పోలీసులు నిందితుడిని పట్టుకుని, గుర్తింపును ధృవీకరించేందుకు తరలిస్తుండగా.. దాడికి దిగాడు. హెచ్చరికగా కాల్పులు జరిపినప్పటికీ.. పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఓ పోలీసు వాహనాన్ని కూడా ధ్వంసం చేశాడు. ఇంతలో ఓ పోలీసు అధికారి గాల్లోకి కాల్పులు జరిపారు కానీ.. అతడు తప్పించుకునేందుకు ప్రయత్నించాడు.
దీంతో నిందితుడిపై మరో రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించామని.. అప్పటికే నిందితుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారని పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకుని గంటల వ్యవధిలోనే ఎన్ కౌంటర్ చేయడం పట్ల బాధితురాలికి న్యాయం జరిగిందని పలువురు పేర్కొంటున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను మరింత కఠిన శిక్షలు విధించాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications