రవి మృతి ఎఫెక్ట్: చిక్కుల్లో హోం మంత్రి, సీఐడి ఐజీ బదిలీపై వెనక్కి
బెంగళూరు: ఐఏఎస్ అధికారి రవి అనుమానాస్పద మృతి కేసు కర్ణాటక హోం శాఖ మంత్రి కే.జే. జార్జ్ మెడకు చుట్టుకునేట్లు కనిపిస్తోంది. ఎంబెసి అనే నిర్మాణ సంస్థలో కే.జే. జార్జ్‌కు, ఆయన బంధువులకు వాటాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కొంతకాలం క్రితం వాణిజ్య పన్న చెల్లించని కంపెనీలు, సంస్థల మీద ఐఏఎస్ అధికారి రవి దాడులు చేసి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.
ఆ సమయంలోనే ఎంబెసి కంపెనీ మీద కూడా దాడులు చేశారు. ఎంబెసి కంపెనీ వాణిజ్య పన్ను చెల్లించలేదని గుర్తించి రికార్డులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ విషయం బయటకు రాకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదే సమయంలో రవి వాణిజ్య పన్ను చెల్లించకుండా ప్రభుత్వానికి మోసం చేస్తున్న కంపెనీల జాబితా తయారు చేశారు.
ఈ నివేదిక తయారు చేస్తున్న సమయంలో ఐఏఎస్ అధికారి డి.కే. రవి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన మరణించిన కొన్ని గంటల వ్యవధిలోనే హొం శాఖ మంత్రి జార్జ్, బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి ఐఏఎస్ అధికారి రవి ఆత్మహత్య చేసుకున్నారని మీడియాకు చెప్పారు.

సంఘటనా స్థలంలో డెత్ నోట్ చిక్కకున్నా, దర్యాప్తు పూర్తి కాకుండానే రవి ఆత్మహత్య చేసుకున్నారని ఎలా వారిద్దరు ప్రకటించారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అధికారంలో ఉన్నామనే ధీమాతో ఐఏఎస్ అధికారి రవి మీద తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకు వచ్చారని వారు ఆరోపిస్తున్నారు. జార్జ్, ఎంఎన్ రెడ్డి మీద కఠిన చర్యలు తీసుకుని వారిని ఆ పదవుల నుండి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
సీఐడికి కేసు బదిలీ, అధికారి బదిలీపై వెనక్కి
కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని తీవ్రస్థాయిలో ఒత్తిడి రావడంతో ప్రభుత్వానికి నిద్ర లేకుండా పోయింది. ఆ సమయంలో కేసు దర్యాప్తు సీఐడికి అప్పగిస్తున్నామని మంగళవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెప్పారు. ఈ ఆదేశాలు జారీ అయిన కొన్ని గంటల వ్యవదిలో బుధవారం ఉదయం సీఐడి విభాగం ఐజీపి ప్రణబ్ మెహంతీని లోకాయక్తకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ బదిలీపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రణబ్ మెహంతీ బదిలీని పెండింగులో పెడుతూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
మెహంతి స్థానంలో ఐజీపి ప్రతాప్ రెడ్డిని నియమించారు. లోకాయుక్తలో ఐజీపి స్థాయి ఉద్యోగం లేకున్నా ప్రభుత్వం ఆఘమేఘాల మీద పదవి స్పృష్టించి బదిలీ చేసింది. అనేక క్లిష్టమైన కేసులను చాకచక్యంగా దర్యాప్తు చేసి నిజాయితీ అధికారి అని పేరు తెచ్చుకున్న ప్రణబ్ మెహంతిని బదిలీ చేసిన కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు ఇరకాటంలో పడింది. దీంతో మెహంతీ బదిలీని పెండింగులో పెట్టింది. అయితే, బదిలీ ఉత్తర్వులను రద్దు చేయలేదని, డికె రవి మృతిపై ఆయన నివేదిక సమర్పిస్తారని, ఆ నివేదిక సమర్పించిన తర్వాత బదిలీ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.












Click it and Unblock the Notifications