జయలలిత ఆభరణాలపై కర్ణాటక కోర్టు సంచలన తీర్పు!!
తమిళనాడు మాజీ దివంగత ముఖ్యమంత్రి జయలలిత బంగారు, వజ్రాభరణాలపై హక్కులకు సంబంధించి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులోని ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అక్రమాస్తుల కేసు విచారణ తరువాత కర్ణాటక అధికారులు జయలలిత ఆభరణాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తమిళనాడు మాజీ దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించి స్వాధీనం చేసుకున్న విలువైన బంగారు ఆభరణాలను అధికారులు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఆభరణాలు తీసుకోవడానికి జయలలిత బంధువులు, కుటుంబీకులు అర్హులు కారని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ మేరకు XXXII అదనపు సిటీ సివిల్ & సెషన్స్ కోర్టులో న్యాయమూర్తి హెచ్‌ఎ మోహన్ అధ్యక్షతన ఉత్తర్వులు జారీ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వాస్తవానికి ఆదాయం పన్ను అధికారులు స్వాధీనం చేసుకున్న ఆస్తులు ప్రస్తుతం కర్ణాటక పోలీసుల సంరక్షణలో ఉన్నాయి.

ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్న 3.5కోట్ల రూపాయలు విలువచేసే 21.28 కేజీల స్వర్ణాభరణాలు, 1.250కేజీల వెండి వస్తువులు, 2కోట్ల రూపాయలు విలువచేసే వజ్రాలు, వెండి కత్తి, 10,500చీరలు, 750చెప్పుల జతలు, 500వైన్ గ్లాసులు వంటివి ఉన్నట్టు సమాచారం. అయితే జయలలిత వెండి బంగారు ఆభరణాలను వేలం వేయాలని కూడా ప్రయత్నం జరిగింది. తాజాగా ఆమె ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశించింది.
జయలలిత చరాస్తులు, బంగారు ఆభరణాలు తమకు చెందుతాయని జయలలిత మేనకోడలు జె.దీపా, మేనల్లుడు జె.దీపక్ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని ఆదేశిస్తూ, ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఇలా అన్నారు . నగలను వేలం వేయడానికి బదులుగా, తమిళనాడు రాష్ట్ర హోం శాఖ ద్వారా వాటిని అప్పగించడం ద్వారా తమిళనాడుకు బదిలీ చేయడం మంచిదని పేర్కొన్నారు.
అంతేకాదు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణకు చేసిన ఖర్చులకు తమిళనాడు ప్రభుత్వం కర్ణాటకకు ఐదు కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చెన్నైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో జయలలితకు సంబంధించిన ఖాతాలో ఫిక్స్‌డ్ డిపాజిట్ నుండి చెల్లింపు చేయనున్నట్టు తెలుస్తుంది.












Click it and Unblock the Notifications