అమానవీయం : రోడ్డుపై కుప్పకూలిన మహిళ... కరోనా అనుమానంతో జేసీబీలో ఆస్పత్రికి తరలింపు..
కరోనా వేళ ఎటుచూసినా విషాద దృశ్యాలే కనిపిస్తున్నాయి... మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ దేశంలో ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. ఓవైపు కరోనా సోకి జనం పిట్టల్లా రాలిపోతుంటే... మరోవైపు కరోనా భయం,అనుమానం అమానవీయ ఘటనలకు దారితీస్తోంది. తాజాగా కర్ణాటకలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఓ మహిళ రోడ్డుపై కుప్పకూలగా కరోనా అనుమానంతో ఎవరూ ఆమె వద్దకు వెళ్లలేదు. చివరకు ఓ జేసీబీలో ఆమెను ఆస్పత్రికి తరలించారు.

అసలేం జరిగింది...
కోలార్ పట్టణానికి చెందిన ఓ మహిళ సోమవారం(మే 3) ఉదయం ఏదో పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వచ్చింది. రోడ్డుపై నడుస్తున్న క్రమంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కరోనా సోకిందేమోనన్న అనుమానంతో రోడ్డుపై వెళ్లేవాళ్లెవరూ ఆమె వద్దకు వెళ్లలేదు. చివరకు ఓ జేసీబీలో అత్యంత అమానవీయంగా ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

మొదటి వేవ్‌లోనూ...
కరోనా పేషెంట్లు,మృతదేహాలను ఇలా జేసీబీల్లో తరలించిన ఘటనలు గతంలోనూ చోటు చేసుకున్నాయి. మృతదేహాల తరలింపులో పలు చోట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమైంది. గతేడాది శ్రీకాకుళం జిల్లాలో కరోనా లక్షణాలతో మృతి చెందిన వారిని జేసీబీ సాయంతో ఖననం చేయడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఇప్పటికీ జేసీబీ సాయంతోనే చాలా చోట్ల కరోనా బాధితుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అంతిమ సంస్కారాలు కూడా సంస్కారహీనంగా జరుగుతున్న తీరు తీవ్ర విషాదాన్ని కలిగిస్తున్నాయి.

రెండు రోజుల క్రితం మహారాష్ట్రలో...
రెండు రోజుల క్రితం మహారాష్ట్రలోని పంప్రి చించ్వాడ్‌లో ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ చనిపోయి రెండు రోజులైనా చుట్టుపక్కల వాళ్లెవరూ ఆ విషయాన్ని గుర్తించలేదు. చివరకు ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఆమె చనిపోయినట్లు గుర్తించారు. తల్లి శవం పక్కనే ఆమె 18 నెలల కొడుకు రెండు రోజులుగా ఆకలితో అలమటిస్తూ ఏడుస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ సాయం చేసేందుకు ఎవరూ వెళ్లలేదు. చివరకు స్థానిక పోలీసులు ఆ ఇంటికి చేరుకుని ఆమె మృతదేహాన్ని తరలించారు. బాలుడిని చేరదీసి అతని ఆకలి తీర్చారు. అనంతరం ఆ బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా కోవిడ్ నెగటివ్‌గా తేలింది.












Click it and Unblock the Notifications