వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కౌన్ బనేగా కరోడ్ పతి: మొట్టమొదట కోటి రూపాయలు గెలిచిన వ్యక్తి ఎవరు... ఇప్పుడు ఏం చేస్తున్నారు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

'కౌన్ బనేగా కరోడ్‌పతి'... సుమారు 22 ఏళ్లుగా అమితాబ్ బచ్చన్ ఈ ప్రోగ్రాంకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 2000 సంవత్సరంలో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' మొదలైంది.

టీవీ తెర మీద అమితాబ్ బచ్చన్‌ను పెద్ద స్టార్‌గా చేయడమే కాదు దేశంలోని ఎంతో మంది సామాన్యుల జీవితాలను సైతం మార్చివేసింది ఈ ప్రోగ్రాం.

హర్షవర్ధన్ నవాథే... 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమంలో తొలిసారి కోటి రూపాయలు గెలుచుకున్నారు. 2000 సంవత్సరం తొలి సీజన్‌లో ఆయన విజేతగా నిలిచారు. ఆయన గెలిచి 22 ఏళ్లు అవుతోంది.

బాలీవుడ్ నటుడు అమితాభ్ బచ్చన్

ఇప్పుడు హర్షవర్ధన్ ఏం చేస్తున్నారు? ఆయన జీవితం ఎలా ఉంది?

2000 సంవత్సరంలో తొలి సీజన్‌లో విజేతగా నిలిచినప్పుడు పేపర్లన్నింటిలోనూ ఆయన గురించి వార్తలు వచ్చాయి.

హర్షవర్ధన్ తండ్రి ఐపీఎస్ ఆఫీసర్. 'కౌన్ బనేగా కరోడపతి' షోకు రాక ముందు హర్షవర్ధన్ సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూ ఉన్నారు.

ప్రస్తుతం హర్షవర్ధన్ దంపతులు ముంబయిలో నివసిస్తున్నారు. ఆయనకు ఇద్దరు అబ్బాయిలు.

'ఈ 22 ఏళ్లలో నా జీవితం చాలా మారి పోయింది. కోటి రూపాయలు గెలిచినప్పుడు నేనొక స్టూడెంట్. ఒంటరివాడిని. ఆ తరువాత కార్పొరేట్ సెక్టార్‌లోకి అడుగు పెట్టాను. పెళ్లి చేసుకున్నాక, ఇద్దరు పిల్లలు పుట్టారు' అని బీబీసీతో హర్షవర్ధన్ చెప్పారు.

'ఒక సారి కుటుంబ జీవితం మొదలైన తరువాత సంసార సాగరంలో మనం ఈదుతూ పోవాల్సి ఉంటుంది. నా విషయంలోనూ అదే జరిగింది. నేడు ఒక పెద్ద కంపెనీలో పని చేస్తున్నాను. మా అమ్మనాన్న నా వద్దే ఉంటున్నారు. వారి బాగోగులు చూసుకుంటున్నాను. నా భార్య మరాఠీ టీవీ యాక్టర్. ఆమె పేరు సారిక. మా పెద్దబ్బాయికి 14 ఏళ్లు. చిన్నవాడికి 10 ఏళ్లు. మూడేళ్లుగా ముంబయిలోనే ఉంటున్నాను' అని ఆయన అన్నారు.

కోటి రూపాయలు గెలిచిన తరువాత జీవితం ఎలా మారింది?

'నా చుట్టుపక్కల వాళ్లు నన్ను చూసే తీరు మారింది. నేను గెలుచుకున్న డబ్బును పెట్టుబడి పెట్టాను. నా చదువు కోసం ఖర్చు చేశాను. మంచి చదువు కోసం విదేశాలకు వెళ్లాను.

డబ్బులు అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు అంటూ చాలా మంది నాకు సలహాలు ఇచ్చారు. నన్ను అతిథిగా చాలా చోట్లకు పిలిచారు. స్కూళ్లు, కాలేజీల కార్యక్రమాలకు చీఫ్ గెస్ట్‌గా వెళ్లాను.

మోడలింగ్, యాక్టింగ్‌ చేస్తావా అంటూ ఆఫర్లు వచ్చాయి. అయితే నాకు ఏది నచ్చితే అదే చేయాలని నిర్ణయించుకున్నా' అని నాటి అనుభవాలను హర్షవర్ధన్ గుర్తు చేసుకున్నారు.

కానీ డబ్బులు గెలుచుకున్న తరువాత ఆయన జీవితం అంత సవ్యంగా ఏమీ ముందుకు సాగలేదు.

'ఒకోసారి సొంత వాళ్లే మనకు శత్రువులుగా మారతారు. వాళ్లకు డబ్బులు వచ్చాయి కానీ మనకు రాలేదని అసూయ పడతారు. నాకు విషయంలో కూడా అలాగే జరిగింది.

నాకు బయటి ప్రపంచం గురించి పెద్దగా తెలియదని, దాన్ని అర్థం చేసుకునే శక్తి లేదని కొందరు అనుకునే వారు. నాకు ఏమైనా చెడు జరుగుతుందేమోనని చాలా మంది భయపడేవారు.

ఇప్పుడు నీకు డబ్బులు వచ్చాయి కదా! అదిగో అక్కడ ఇన్వెస్ట్ చెయ్, ఇదిగో ఇక్కడ పెట్టుడి పెట్టు అంటూ ఎవరికి తోచిన సలహాలు వారు ఇవ్వడం మొదలు పెట్టారు. అది చెయ్, ఇది చెయ్ అంటూ చెప్పేవారు.

ఇలాంటి పరిస్థితి అందరికీ ఎదురయ్యే ఉంటుంది. కానీ ఇలాంటి వాటి వల్ల మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. ఆ అనుభవాలతో నేర్చుకున్న పాఠాల వల్ల, దేవుని దయ వల్ల మేం జీవితంలో ముందుకే సాగాం. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది' అని ఆయన వివరించారు.

'కౌన్ బనేగా కరోడ్‌పతి(కేబీసీ)'లో కోటి రూపాయలు గెలిచినప్పుడు డబ్బు, పేరు, గుర్తింపు అన్నీ హర్షవర్ధన్‌కు వచ్చాయి. కానీ తాను కన్న కల మాత్రం ఆయనకు దూరం అయింది.

ఐఏఎస్ కావాలన్నది ఆయన కల. ఆ కల కల్లగానే మిగిలిపోవడానికి ఒక కారణం ఆ కోటి రూపాయల వలన వచ్చిన పేరు, గుర్తింపు అని హర్షవర్ధన్ చెప్పారు.

'అప్పుడు ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతున్నాను. నాడు నా ప్రిపరేషన్ పీక్‌లో ఉంది. ఆ షో లేకుండా ఉండి ఉంటే నేను ఐఏఎస్ అయి ఉండేవాడినేమో. షోలో పాల్గొనక ముందు ఐఏఎస్ కావడమే నా జీవిత లక్ష్యంగా ఉండేది.

కానీ కోటి రూపాయలు గెలిచాననే ఆలోచన వస్తే ఐఏఎస్ కాలేదనే బాధ కొంత వరకు తగ్గుతుంది.

జీవితం ఒకటి తీసుకుంటే తప్పకుండా ఇంకోదాన్ని ఇస్తుంది.

ఐఏఎస్ కావాలన్న నా కల నాకు దూరమైంది. నా జీవితం మీద ఆ విజయం చూపిన ప్రభావాన్ని కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. ఇలాంటప్పుడు మనల్ని మనం నియంత్రించుకోవడం ఎంతో అవసరం. విజయం, డబ్బు చూసిన తరువాత మన కలలను పక్కన పెట్టకూడదు' అని హర్షవర్ధన్ చెప్పారు.

మరాఠీ నటి సారికను హర్షవర్ధన్ పెళ్లి చేసుకున్నారు. వారికి పెళ్లి అయి 16ఏళ్లు కావొస్తోంది.

'నేను హర్షవర్ధన్‌ను పెళ్లి చేసుకుంటున్నానని తెలియగానే నన్ను చూసే తీరు మారింది. ఒకసారి ప్రొడ్యూసర్ నుంచి చెక్ తీసుకుంటున్నా. కేబీసీ విన్నర్‌ను పెళ్లి చేసుకుంటున్నావ్ కదా! ఇక ఇప్పుడు పని చేయాల్సిన అవసరం నీకు ఏముంది? అని ఆ ప్రొడ్యూసర్ అన్నారు.

నా కంటూ ఒక వృత్తి జీవితం ఉందనే విషయాన్ని చాలా మంది ప్రజలు గుర్తించే వారు కాదు. అలా నాకు ఎన్నోసార్లు జరిగింది' అని సారిక అన్నారు.

ఒకసారి కాదు రెండుసార్లు

కేబీసీ నియమాల ప్రకారం ఒకసారి విజేతగా నిలిచాక మరొక సారి ఆ షోలో పాల్గొనడానికి లేదు. కానీ హర్షవర్ధన్ రెండోసారి కూడా ఆ షోలో పాల్గొన్నారు.

తొలి సీజన్‌లో కోటి రూపాయలు గెలిచిన హర్షవర్ధన్, సెలెబ్రిటీ గెస్ట్‌గా రెండో సీజన్‌లో ఆడారు. ఆ షోలో రూ.25 లక్షలు గెలిచిన ఆయన స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇచ్చారు.

తనకు మూడోసారి ఆడే అవకాశం రాకపోవచ్చనే విషయం హర్షవర్ధన్‌కు తెలుసు. అయితే కేబీసీ షో అలాగే కొనసాగితే తన పెద్ద కొడుకు తప్పకుండా అందులో పాల్గొంటాడని ఆయన చెబుతున్నారు.

ఈ 22 ఏళ్లలో అనేక ఫేక్ న్యూస్‌కు హర్షవర్ధన్ కుటుంబం బాధితులుగా మారింది.

సుమారు రెండున్నర ఏళ్ల కిందట ఒక కంపెనీ వీడి మరొక కంపెనీలో చేరుతున్నట్లు ఒక పెద్ద న్యూస్ పేపర్‌తో మాట్లాడుతూ హర్షవర్ధన్ చెప్పారు. అయితే ఆ కంపెనీలో కొత్త కంపెనీ పేరు కానీ, ఆయన ఎప్పుడు జాయిన్ అవుతారని కానీ చెప్పలేదు.

హర్షవర్ధన్ ఇంటర్వ్యూ చూసిన మరొక పేపర్, 'ఆయనకు ఎటువంటి ఉద్యోగం లేదు. ఉద్యోగం కోసం ఆయన వెతుకుతున్నారు. వారి కుటుంబం డబ్బులు లేక కష్టాలు పడుతోంది' అని రాసింది.

పేపర్‌లో న్యూస్ చూసిన బంధువులు హర్షవర్ధన్‌కు ఫోన్లు చేయడం ప్రారంభించారు. వాళ్ల పిల్లలు స్కూలుకు వెళ్లినప్పుడు 'ఇంట్లో అంతా బాగానే ఉందా?' అంటూ టీచర్లు అడగడం మొదలు పెట్టారు.

ఇలాంటి సందర్భాలు తమకు ఎన్నో ఎదురయ్యాయని, అవి తమకు అలవాటుగా మారాయని వారు చెబుతున్నారు.

'హర్షవర్ధన్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. కానీ నేను చాలా యాక్టివ్‌గా ఉంటాను. మనం మన జీవితం గురించి మంచి విషయాలే చెప్పినా వాటిని వక్రీకరించి చెప్పేవాళ్లు ఉంటారు' అని సారిక అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Kaun Banega Crorepati: Who was the first person to win crore rupees...what is he doing now
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X