విలీనంపై చర్చలే జరగలేదు: దిగ్విజయ్‌కి కెసిఆర్ రిప్లై
న్యూఢిల్లీ: కాంగ్రెసులో తమ పార్టీ విలీనంపై చర్చలే జరగలేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి విలీనం వార్తలపై ఆయన స్పందించారు. విలీనంపై మీడియాలో జరుగుతున్నదంతా దుష్ప్రచారమేనని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు విలీనంపై కాంగ్రెస్ నేతలతో చర్చలు జరగలేదని, దీనిపై జరుగుతున్న ప్రచారాన్ని పార్టీ కార్యకర్తలు నమ్మవద్దని ఆయన అన్నారు.
విలీనానికి సంబంధించి తెరాసతో ప్రాథమికంగా చర్చలు జరిగినట్లు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ చెప్పిన విషయం తెలిసిందే. తెరాస, కాంగ్రెస్ విలీనంపై ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదని, త్వరలో దీనిపై నిర్ణయం వెలువడుతుందని ఆయన మంగళవారంనాడు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. ఈ దశలో విలీనం వార్తలను కెసిఆర్ కొట్టేయడం విశేషం.

కాగా 'రేపటి తెలంగాణ'లో తెరాస కొనసాగుతుందని, రాష్ట్ర పునర్నిర్మాణంలో పాల్గొంటుందని ఆ పార్టీ నేతలు పలువురు అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం కెసిఆర్ నాయకత్వాన్ని బలపరచాలని సిద్దిపేటలో జరిగిన విజయోత్సవ సభలో హరీశ్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. తెరాసలో నూటికి 90 శాతం మంది విలీనం వద్దని అంటున్నారని, తెలంగాణ పునర్నిర్మాణం కూడా తమ చేతుల మీదుగానే జరగాలని ఆకాంక్షిస్తున్నారని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వినోద్‌కుమార్ ఢిల్లీలో చెప్పారు.
కాంగ్రెస్‌లో విలీనం ఉండదని, పొత్తు మాత్రమే ఉంటుందని మరో పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయని నరసింహారెడ్డి స్పష్టం చేశారు. తెరాస ఒంటరిగానే పోటీ చేయాలంటూ కెసిఆర్‌రరు వివిధ వర్గాల నుంచి పెద్ద యెత్తున ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. త్వరలో కేసీఆర్ పార్టీ రాష్ట్ర కమిటీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలతో సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారని చెప్పారు.












Click it and Unblock the Notifications