టిపై కెసిఆర్ లాబీయింగ్: తేల్చని శరద్, ప్రస్తుతం శాంతి..
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై తాము ఆందోళనగా ఉన్నామని, రెండు ప్రాంతాల్లోను శాంతిని నెలకొల్పే పరిష్కారం అవసరమని (జెడి)యు అధ్యక్షులు శరద్ యాదవ్ ఆదివారం అన్నారు. తెలంగాణ బిల్లుకు మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆయనను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ప్రస్తుతం తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారమై శాంతి, సామరస్యాలు నెలకొనాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణకు మీరు మద్దతు ఇచ్చారు కదా అని ప్రశ్నించగా.. మద్దతిచ్చాం కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం శాంతి నెలకొల్పాలన్నారు. పార్లమెంటులో ఇది చర్చకు వచ్చినప్పుడు తాము తప్పకుండా తగిన పరిష్కారాలను సూచిస్తామన్నారు. అయితే, శరద్ యాదవ్ తాజాగా తెలంగాణపై స్పష్టత ఇవ్వలేదు.

కె కేశవ రావు, వినోద్ కుమార్, మందా జగన్నాథం, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో కలిసి కెసిఆర్ అంతకుముందు ఆర్జేడి అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్, లోక్ జనశక్తి పార్టీ అధినేత పాశ్వాన్‌లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ తెలంగాణకు పూర్తి మద్దతు ప్రకటించారు. విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి, కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని లాలూ డిమాండ్ చేశారు. పార్లమెంటుకు బిల్లు వచ్చినప్పుడు తమ పార్టీ ఎంపీలు మద్దతుగా ఓటేస్తారని తెలిపారు.
గతంలో తాను బీహార్ విభజనను వ్యతిరేకించానని, అయితే రాష్ట్రాలను విభజించేది కేంద్రమే కాబట్టి తర్వాత అంగీకరించాల్సి వచ్చిందని తెరాస బృందానికి ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చిన్న రాష్ట్రాలు ఇరు ప్రాంతాల ప్రజలకూ మేలు చేకూరుస్తుందని, త్వరగా రాష్ట్ర విభజన చేసి ఇరు ప్రాంతాల్లోనూ శాంతిని నెలకొల్పాల'ని సూచించారు.
అసెంబ్లీ తీర్మానం అనేది కేవలం లాంఛనమేనని, బిల్లును అసెంబ్లీ ఆమోదించినా, తిరస్కరించినా కేంద్రం చేయాలనుకుంటే విభజన చేస్తుందని చెప్పారు. తెలంగాణను ఏర్పాటు చేయాలని తాను కూడా సోనియా, మన్మోహన్‌లను కోరతానని తెరాస బృందానికి ఆయన హామీ ఇచ్చారు. తాము మద్దతు ఇవ్వటంతో పాటు ఇతర పార్టీల మద్దతును కూడా కూడగడతామని పాశ్వాన్ వారికి అభయం ఇచ్చారు.
ఇక శరద్ యాదవ్ మాత్రం మద్దతుపై స్పష్టత ఇవ్వలేదు. తెలంగాణ సమస్యకు పరిష్కారం సరిగా ఉండాలని, రెండు ప్రాంతాల ప్రజలకు శాంతి లభించాలన్నారు. అయితే, జెడియు ఇప్పటికే తెలంగాణకు మద్దతు ప్రకటించిందని, 2005లో అనుకూలంగా లేఖ ఇచ్చిందని కెసిఆర్ తెలిపారు.












Click it and Unblock the Notifications