బెస్ట్ సీఎంలలో కేజ్రీ ఫస్ట్, బాబు థర్డ్: ప్రధానిగా మోడీకి మార్కులు
హైదరాబాద్: దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రులలో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు మూడోస్థానం దక్కింది. తాజాగా ఇండియా టుడే నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో చంద్రబాబుకు ఈ స్థానం కట్టబెట్టారు. దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రిగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎంపికయ్యారు.
రెండోస్థానంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నిలిచారు. ఇప్పటికప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో లోకసభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 20 సీట్లు వస్తాయని ఇండియాటుడే సర్వేలో తేలింది.
దేశవ్యాప్తంగా ఇండియా టుడే 12వేల మంది అభిప్రాయాన్ని సేకరించింది. పదిహేడు శాతం మంది అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతు పలికారు. యూపీ సీఎం అఖిలేష్ 8 శాతంతో రెండో స్థానంలో, ఏపీ సీఎం చంద్రబాబు ఆరు శాతంతో మూడో స్థానంలో ఉన్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లు ఐదు శాతంతో నాలుగో స్థానంలో ఉన్నారు.

అయితే, వారి వారి రాష్ట్రాల పరంగా చూస్తే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అందరికంటే ముందు స్థానంలో ఉన్నారు. పట్నాయక్‌కు సొంత రాష్ట్రంలో 69 శాతం మంది, ఢిల్లీలో కేజ్రీవాల్ పట్ల, ఏపీలో చంద్రబాబు పట్ల 55 శాతం మంది, కర్నాటక సీఎం సిద్దరామయ్య పట్ల ఆ రాష్ట్రంలో 38 శాతం మంది, ఛత్తీస్ గఢలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ పట్ల 36 శాతం మంది, మధ్యప్రదేశ్‌లో ఆ రాష్ట్రంలో 34 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ పట్ల...
ప్రధాని నరేంద్ర మోడీ పది నెలల పాలన పైన ఇండియా టుడే సర్వే చేసింది. ఒపీనియన్ పోల్‌లో పాల్గొన్న వారిలో 22 శాతం మంది ప్రధాని మోడీ పాలన చాలా బాగుందని, 33 శాతం మంది బాగానే ఉందని, 11 శాతం మంది మాత్రం బాగాలేదని చెప్పారు. 26 శాతం మంది యావరేజ్ అన్నారు.
ఇప్పటికిప్పుడు లోకసభ ఎన్నికలు జరిగితే బీజేపీ 282 సీట్ల నుండి 255 సీట్లకు పడిపోతుందని, కాంగ్రెస్ పార్టీ 44 సీట్ల నుండి 53 సీట్లకు పెంచుకుంటుందని సర్వేలో వెల్లడయింది. 29 శాతం మంది మోడీ ఫ్యాషన్ సెన్స్‌ను వ్యతిరేకిస్తే, అది సంబంధం లేని విషయమని 22 శాతం మంది చెప్పారు. 39 శాతం మంది గుడ్ ఫ్యాషన్ సెన్స్ అన్నారు. మొత్తంగా ఇప్పటికీ మోడీ హవా ఉందని తేలినట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications