ఎన్నికల్లో పోటీ: కాంగ్రెస్ నాయకురాలి జుట్టు కట్
తిరువనంతపురం: స్థానిక ఎన్నికలలో పోటీ చేసిందని జీర్ణించుకోలేని సీపీఎం నాయకులు కాంగ్రెస్ నాయకురాలి జుట్టు కత్తిరించి ప్రతికారం తీర్చుకున్న సంఘటన కేరళలో జరిగింది. ఈ విషయంపై కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కమ్యూనిస్టు పార్టీలకు ప్రత్యర్థి పార్టీల మీద అసహనం పెరిగిపోతోందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని ఉమెన్ చాందీ అన్నారు. ఇలాంటి సంఘటనలను తాము చూస్తూ ఊరుకోమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉమన్ చాందీ చెప్పారు.
తిరువనంతపురం జిల్లాలోని పెరుంకడవిలా ప్రాంతంలో సతికుమారి (50) అనే మహిళ నివాసం ఉంటున్నారు. ఈమె కాంగ్రెస్ నాయకురాలు. గత నెలలో జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికలలో సీపీఎం అభ్యర్థిపై పోటి చేశారు.

సతికుమారికి కేవలం 814 ఓట్లు రావడంతో ఆమె ఓడిపోయారు. అప్పటి నుంచి సీపీఎం నాయకులు సతికుమారి మీద కక్ష పెంచుకున్నారు. ఈనెల 11వ తేదిన తిరువనంతపురంకు 20 కిలోమీటర్ల దూరంలోని అమరవిలా ప్రాంతంలో సతికుమారిని ఇద్దరు వ్యక్తులు పట్టుకున్నారు.
తరువాత ఆమె జుట్టు కత్తిరించి చేతిలో పట్టుకుని ఈ సారి మా మీద పోటి చేస్తే మరింత అవమానం తప్పదని హెచ్చరించి అక్కడి నుంచి పరారైనారు. డీసీసీ సభ్యురాలైన సతికుమారి మీద దాడి చేసి జుట్టు కత్తిరించిన వారిని వెంటనే అరెస్టు చెయ్యాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications