శబరిమలకు వచ్చే భక్తులకు తప్పనిసరిగా కరోనా పరీక్షలు: కేరళ సర్కారు నూతన మార్గదర్శకాలు
తిరువనంతపురం: ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులు వస్తున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా డిసెంబర్ 26 తర్వాత నుంచి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు, ఆలయం వద్ద పనిచేసే అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకుని రావాల్సిందేనని స్పష్టం చేసింది.
ఈ మేరకు కేరళ వైద్య ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కేరళలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న క్రమంలో కరోనా మార్గదర్శకాలను సవరించినట్లు వైద్య శాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు. డిసెంబర్ 26న మండల పూజ అనంతరం అయ్యప్ప క్షేత్రం వద్ద విధులు నిర్వహించే సిబ్బంది, దర్శనానికి వచ్చే భక్తులకు కరోనా పరీక్షలు తప్పనిసరి చేసినట్లు మంత్రి తెలిపారు.

సిబ్బంది, భక్తులు కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని మంత్రి కోరారు. శబరిగిరులపై ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు భక్తులు భౌతిక దూరం పాటించాలని సూచించారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకే తాము ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
కాగా, గత నెల రోజుల వ్యవధిలో ఆలయం వద్ద 299 మందికి కరోనా సోకినట్లు వైద్య అధికారులు తెలిపారు. వీరిలో 51 మంది భక్తులు, 245 మంది సిబ్బంది, మరో ముగ్గురు అధికారులు ఉన్నారని చెప్పారు. దీంతో శబరిమలకు వచ్చే భక్తులు నీళక్కల్ బేస్ క్యాంపు చేరుకునేందుకు 24 గంటల ముందే ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకున్నట్లుగా ఉన్న కరోనా నెగిటివ్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుందని అదికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications