దక్షిణాదిని వణికిస్తున్న ‘నిఫా’ వైరస్.. కేరళలో పాజిటివ్ కేసు
దక్షిణాదిని 'నిఫా' వైరస్ భయం మరోసారి వెంటాడుతోంది. కేరళలోని కోజికోడ్ జిల్లా రమణట్టుకర మున్సిపాలిటి పరిధిలో ఒకరికి నిఫా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. 43 ఏళ్ల బాధితుడు ప్రస్తుతం కోజికోడ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలోని ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. మెడికల్ బోర్డు సిఫార్సుల మేరకు బాధితునికి ఇప్పటికే 'మోనోక్లోనల్ యాంటీబాడీ' చికిత్స మొదటి డోసును అందించారు. పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థ (NIV) నుంచి నివేదిక వచ్చిన వెంటనే కేరళ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టింది.
వైరస్ సోకిన వ్యక్తికి సంబంధించిన రూట్ మ్యాప్‌ను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. బాధితునితో సంబంధాలు కలిగి ఉన్న 87 మందిని గుర్తించి కాంటాక్ట్ లిస్ట్‌లో చేర్చారు. వీరిలో 58 మంది ఆరోగ్య కార్యకర్తలు, 14 మంది కుటుంబ సభ్యులు, ఐదుగురు స్నేహితులు ఉన్నారు. అత్యంత ప్రమాదం (హై రిస్క్) పొంచి ఉన్న వారిని క్వారంటైన్‌కు తరలించారు.

అయితే, ప్రస్తుతం ఈ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న ఎవరికీ వైరస్ లక్షణాలు లేవని, ఇప్పటివరకు వచ్చిన శాంపిల్స్ నివేదికలన్నీ నెగెటివ్‌గా వచ్చాయని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె. మురళీధరన్ స్పష్టం చేశారు. వైరస్ మరింతగా వ్యాప్తి చెందలేదని, అందువల్ల కంటైన్‌మెంట్ జోన్లు ప్రకటించాల్సిన పరిస్థితి ప్రస్తుతం లేదని ఆయన పేర్కొన్నారు. పరిస్థితిని సమీక్షించడానికి 'నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్' (NCDC) నిపుణుల బృందం కూడా కోజికోడ్ చేరుకుంది.
సరిహద్దుల్లో నిలిచిన తమిళనాడు.. ప్రత్యేక స్క్రీనింగ్ క్యాంపులు
కేరళలో నిఫా కేసు నమోదు కావడంతో పొరుగు రాష్ట్రమైన తమిళనాడు ప్రభుత్వం తక్షణమే అప్రమత్తమైంది. వైరస్ తమ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు కేరళ సరిహద్దు జిల్లాలైన నీలగిరి, కోయంబత్తూర్, తెనె, కన్యాకుమారి, కడలూరు ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖను స్టాండ్‌బైలో ఉంచింది. ఇరు రాష్ట్రాల మధ్య నిరంతరాయంగా రవాణా సాగుతున్న నేపథ్యంలో.. నీలగిరి జిల్లా కలెక్టర్ లక్ష్మి భవ్య తన్నేరు ఆదేశాల మేరకు ఆరోగ్య సిబ్బంది సరిహద్దుల్లో రంగంలోకి దిగారు. తాళూర్, నాడుగని, నంబియార్‌కున్ను, సోలాడి, పట్టవాయల్ వంటి కీలక సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక వైద్య బృందాలను మోహరించి, కేరళ నుంచి వచ్చే ప్రయాణికులకు నిశితంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారిని ముందస్తు జాగ్రత్తగా మెడికల్ క్యాంపులకు తరలిస్తున్నారు.
నిఫా పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు నిఫా వైరస్ వ్యాప్తికి అనుకూలమైన సమయం కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- వాడుకలో లేని పాడుబడిన బావులు, గబ్బిలాలు ఎక్కువగా ఉండే చెట్లను తాకవద్దు.
- గబ్బిలాలు లేదా ఇతర పక్షులు కొరికిన పండ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి.
- ఆసుపత్రులకు వెళ్లే సమయంలో, ముఖ్యంగా జ్వరం ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. పెంపుడు జంతువులను తాకిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
ఇంట్లో ఎవరికైనా తీవ్రమైన జ్వరం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా తక్షణమే వైద్య సహాయం పొందాలి. అనుమానాల నివృత్తి కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లను (0495 2373901, 9072007767) కూడా అందుబాటులో ఉంచారు.














Click it and Unblock the Notifications