అవమానం: బతికుండగానే ప్రిన్సిపాల్‌కి సమాధి కట్టారు!
పాలక్కడ్: నేటి తరం విద్యార్థుల్లో గురువుల పట్ల ఏమాత్రం గౌవరం లేకుండా పోతోంది. వారి పిచ్చి ప్రవర్తనతో గురువులను అవమానాలకు గురిచేస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా కేరళ రాష్ట్రంలో జరిగిన ఉదంతాన్ని చెప్పుకోవచ్చు.
వివరాల్లోకి వెళితే.. గత మార్చి 31న కేరళలోని పలక్కాడ్ లో గవర్నమెంట్ విక్టోరియా కాలేజీకి ప్రిన్సిపాల్ డాక్టర్ టిఎన్ సరసు (56) వచ్చారు. కాగా, ప్రిన్సిపాల్‌గా ఆమెకది చివరి రోజు. కాలేజీ ఆవరణంలోకి రాగానే అక్కడి దృశ్యాన్ని చూసి సరసు దిగ్భ్రాంతికి గురయ్యారు. కాలేజీ ముందు కొద్ది గంటల క్రితమే తీసిన ఓ సమాధి కనిపించింది.
ఈ క్రమంలో ఇది ఎవరి సమాధి అని అక్కడున్న ఓ విద్యార్థిని ప్రిన్సిపాల్ అడిగారు. మీదే అంటూ ఆ విద్యార్థి సమాధానం ఇవ్వడంతో సరసు నిర్ఘాంతపోయారు. ఈ ఘటనపై ప్రిన్సిపాల్ విచారించగా.. హాస్టల్ విద్యార్థులు ఆ రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో సమాధి తీసినట్టు తెలిసింది.

సరసు మాట్లాడుతూ.. 'తరగతులను బహిష్కరించేందుకు, నిరసన తెలిపేందుకు ఎస్ ఎఫ్ఐ విద్యార్థులకు నేను అనుమతి ఇవ్వలేదు. కాలేజీలు ఈవెంట్లు, నిరసనల విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను, నిబంధనలను కచ్చితంగా అమలు చేశాను. కాబట్టి వారు నాకు వీడ్కోలు బహుమతిగా ఇది (సమాధి) ఇచ్చారు' అని చెప్పారు.
అంతేగాక, 'ఈ ఘటనలో విద్యార్థులకు మాత్రమే కాదు లెఫ్ట్ పార్టీలతో అనుబంధమున్న కొందరు టీచర్ల ప్రమేయం కూడా ఉంది' అని తెలిపారు. ప్రిన్సిపాల్ సరసు ఫిర్యాదు మేరకు పోలీసులు విద్యార్థులపై పరువు నష్టం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
కాగా, 27ఏళ్ల పాటు లెక్చరర్‌గా పాఠాలు చెప్పిన సరసు.. 8నెలల పాటు కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఈ కాలేజీలో పనిచేసినందుకు తనకు గర్వంగా ఉందని సరసు తెలిపారు.
127ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కళాశాలలోనే మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టిఎన్ శేషన్, మేట్రోమ్యాన్ శ్రీధరన్, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఈఎంఎస్ నంబుద్రిపాద్, రచయిత, కార్టూనిస్ట్ ఓవి విజయన్ లాంటి ప్రముఖులు విద్యనభ్యసించారు.












Click it and Unblock the Notifications