
Tula Varsham అంటే ఏంటి.. కేరళకు పొంచి ఉన్న ప్రమాదం,భారీ వర్షాలు
తిరువనంతపురం: కేరళను ఓ వైపు కరోనావైరస్ భయం పట్టిపీడిస్తుంటే మరోవైపు భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన తుపానుల కారణంగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు రానున్న ఐదు రోజుల వరకు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది.కొన్ని జిల్లాల్లో 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని తిరువనంతపురం భారత వాతావరణ శాఖ డైరెక్టర్ సంతోష్ తెలిపారు.

సముద్రం అల్లకల్లోలం
తుపాను కారణంగా తీరం వెంబడి పెనుగాలులు వీచే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. సముద్రం కూడా అల్లకల్లోలంగా మారుతుందని వెల్లడించారు. రానున్న ఐదు రోజులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకోసం సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు చెప్పారు. అంతకుముందు అక్టోబర్ 9వ తేదీన కొల్లాం, పతనంతిట్ట, అలపుజ్జా, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది.

ముందస్తు జాగ్రత్త చర్యలు
ఇక కేరళలో భారీ వర్షాల దృష్ట్యా విజయన్ సర్కార్ పలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఇ:దులో భాగంగా రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అన్ని ప్రయాణాలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్క తిరువనంతపురం జిల్లా మినహాయిస్తే 13 జిల్లాలకు హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా అధికారులు సిబ్బంది అలర్ట్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. పతనంతిట్ట, ఇడుక్కి, అలపుజ్జా, ఎర్నాకులం, కొట్టాయం జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపినట్లు కేరళ మంత్రి కే రాజన్ చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.

నిండిన రిజర్వాయర్లు
అన్ని శాఖల సమన్వయంతో అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని మంత్రి చెప్పారు. ఎలాంటి విపత్తు వచ్చిన తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే 622 మందిని సురక్షిత శిబిరాలకు తరలించడం జరిగింది. ఇదిలా ఉంటే భారీగా కురుస్తున్న వర్షాలతో అన్ని రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. చాలకుడి నదితో పాటు దానికి సంబంధించిన కెనాల్స్ అన్ని పొంగి ప్రవహిస్తున్నాయి. పెరింగల్‌కుతు రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరుగుతుండటంతో అధికారులు గేట్లు ఎత్తివేసి దిగువకు నీరు వదిలారు. పలు ప్రాంతాల్లో పర్యాటకులు వెళ్లేందుకు అనుమతి లేదని అధికారులు తెలిపారు.

పతనంతిట్ట జిల్లాలో భారీ వర్షాలు
ఇదిలా ఉంటే అయ్యప్ప స్వామి కొలువై ఉన్న పతనంతిట్ట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సమయంలో 12 సెంటిమీటర్ల మేరా వర్షం కురిసినట్లు అధికారులు అంచనా వేశారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు జిల్లాలో 168 సెంటిమీటర్ల మేరా వర్షపాతం నమోదైంది. ఇది సగటు వర్షపాతం కంటే 4 శాతం ఎక్కువని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తులా వర్షం అంటే ఏంటి..?
ఇక ఈశాన్య రుతుపవనాలకు సమయం ఆసన్నమైంది. దీన్ని తులావర్షం అని పిలుస్తారు. తులావర్షం అనేది మళయాలం నెల తులం సమయంలో కురుస్తుంది. తులం నెల అక్టోబర్-నవంబర్ మధ్యలో వస్తుంది. ఆ సమయంలో కురిసే వర్షాలను తులావర్షంగా పిలుస్తారు. కేరళలో తులవర్షం అత్యధికంగా పతనంతిట్ట జిల్లాలో కురుస్తుంది. అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ నెల మధ్యలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించినప్పుడు సగటున 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. అయితే గతేడాది తులావర్షం అంతకుముందు ఏడాదితో పోలిస్తే 12శాతం తక్కువగా నమోదయ్యాయి.అయితే వేసవిలో భారీ వర్షాలు కురవడంతో అక్కడ దాదాపు 20 రిజర్వాయర్లన్ని నిండుకుండలా మారాయి.
మొత్తానికి కేరళను వర్షాల బెడద ఇప్పుడప్పుడే వీడేలా లేదు. అరేబియన్ సముద్రం, బంగాళాఖాతం పై ఏర్పడుతున్న అల్పపీడనంతో మరిన్ని భారీ వర్షాలు కేరళలో కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో వరదలు కూడా వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.