కన్నతల్లే కాలయముడై.. నీళ్లల్లో ముంచి ఇద్దరు పిల్లల్ని చంపేసి.. కారణం ఏంటి..?
కేరళ పాలక్కాడ్ జిల్లాలోని కోజిన్ జంపారాలో ఇద్దరు పిల్లలు నీటి ట్యాంకులో మునిగి మృతి చెందిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కన్న తల్లే ఇద్దరు పిల్లల్ని నీళ్ల ట్యాంక్ లో వేసి చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ముక్కు పచ్చలారని చిన్నారులు జెన్నీఫర్ జూలియట్(5), రాబిన్ క్రిస్టోఫర్(3) లను తల్లే కిరాతకంగా హతమార్చడంతో ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను డిప్యూటీ ఎస్పీ ఎస్. శశిధరణ్ మీడియాకు వెల్లడించారు. తల్లి నివేద్య.. పిల్లల్ని చంపినట్లు నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. అయితే పిల్లల్ని చంపాల్సిన అవసరం ఏం వచ్చింది..? అందుకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉందని వివరించారు. మరోవైపు చిన్నారుల తండ్రి జాన్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన పిల్లలు చనిపోవడానికి గల కారణం తెలియాలని డిమాండ్ చేశాడు.
" నాకు కారణం తెలియాలి. ఏదైనా సమాచారం ఉందంటే అది ఫోన్ లోనే ఉంటుంది. అందుకే ఫోన్ చెక్ చేయాలి. నా పిల్లలకు న్యాయం జరగాలి" అని తండ్రి జాన్ కుమార్ తన ఆవేదనను వెల్లడించారు. పిల్లలు కూరన్ కట్టులోని తమ ఇంటి ముందే ఆడుకుంటున్నారని అనుకోగా బాత్ రూమ్ లోని కాంక్రీట్ వాటర్ ట్యాంక్ లో చిన్నారులు శవమై తేలడం సంచలనంగా మారింది. నివేద్య తొలుత పోలీసులకు.. తాను కిచెన్ లో వంట చేస్తుండగా పిల్లల శబ్దం వినిపించలేదు.. దాంతో వారికోసం వెతికాను.. అయితే వాళ్లు వాటర్ ట్యాంక్ లో శవమై కనిపించారు.. అని పేర్కొంది. చిన్నారులను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని వివరించింది.

అయితే నివేద్య తీరుపై బంధువులకు అనుమానం కలిగింది. చిన్నారులిద్దరికీ ఈత కొట్టడం వచ్చని.. గతంలోనూ అదే ట్యాంక్ లో చాలాసేపు ఆడేవారని బంధువులకు తెలుసు. ఈ క్రమంలో వారికి నివేద్యపై అనుమానం వచ్చింది. పిల్లలిద్దరూ ట్యాంక్ లో పడి ఒకే సమయంలో ఎలా చనిపోతారని ప్రశ్నలు లేవనెత్తారు. కాంక్రీట్ ట్యాంక్ మూడు అడుగుల ఎత్తులో ఉంటుందని సమాచారం. ఇక పిల్లల పోస్టుమార్టంలో వాళ్లు ఊపిరాడక చనిపోయారని నిర్థారణ అయింది. అయితే ప్రస్తుతానికి తల్లే పిల్లల్ని చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. కానీ ఈ కేసుపై లోతుగా దర్యాప్తు సాగుతోందని రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications
