పెరుగుతోన్న కరోనా కేసులు: ఆ రాష్ట్రంలో మళ్లీ వీకెండ్ లాక్‌డౌన్: కొత్త గైడ్‌లైన్స్ ఇవే
తిరువనంతపురం: దేశంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతోన్నప్పటికీ..కేరళలో ఆ పరిస్థితి లేదు. రోజువారీ కొత్త కేసులు వేలసంఖ్యలో నమోదవుతోన్నాయి. దేశంలో నమోదవుతోన్న మొత్తం కేసుల్లో 30 శాతం వరకు వాటా కేరళదే. పాజిటివిటీ రేటు కూడా అక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటోంది. దీనితో కేరళ ప్రభుత్వం వారాంతపు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని నిర్ణయించింది. ఈ శని, ఆదివారాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా ఆంక్షలను కూడా మళ్లీ విధించింది.
ఈ ఆంక్షలు.. గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి వస్తాయి. కేరళలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న పంచాయతీలను టెస్ట్ పాజిటివిటీ రేటు ఆధారంగా ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించింది. టెస్ట్ పాజిటివిటీ రేటు 18 శాతానికి పైగా ఉన్న పంచాయతీలు-80, 12 నుంచి 18 శాతం వరకు ఉన్నవి-316, 6 నుంచి 12 మధ్య ఉన్న పంచాయతీలు-473, ఆరు శాతానికి తక్కువగా నమోదైన పంచాయతీలు 165గా ఉన్నట్లు గుర్తించింది. దీని ఆధారంగా ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. ఏ,బీ,సీ కేటగిరీల్లో ఉన్న ప్రాంతాల్లో దుకాణాలు రాత్రి 8 గంటల వరకు తెరచి ఉంచడానికి అనుమతి ఉంది.

కేరళలో కరోనా వైరస్ రీప్రొడక్టివిటీ వేల్యూ అనూహ్యంగా పెరుగుతోందంటూ చెన్నైకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ సైన్సెస్ హెచ్చరించిన నేపథ్యంలో- అక్కడి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలను చేపట్టింది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత దాదాపు అన్ని రాష్ట్రాలో అదుపులోకి వచ్చినప్పటికీ.. కేరళ, మహారాష్ట్రల్లో ఒకింత ఆందోళనకరంగానే ఉంటోంది. దీన్ని నివారించడానికి ఇప్పటికే కేరళ ప్రభుత్వం వీకెండ్ లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. దీన్ని మరింత కఠినతరం చేస్తూ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. గురువారం అర్ధరాత్రి నుంచి అవి అమల్లోకి రానున్నాయి. శని, ఆదివారాల్లో కంప్లీట్ లాక్‌డౌన్ అమలవుతుంది.












Click it and Unblock the Notifications