వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిసాన్ క్రెడిట్ కార్డ్:  రైతుకు రూ. 3 లక్షల లోన్.. ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
వ్యవసాయం

ప‌ల్లెల్లో పేద రైతు త‌న పొలంలో సాగుకు పెట్టుబ‌డి పెట్ట‌డానికి అత్య‌వ‌స‌రంగా ఒక ల‌క్ష రూపాయ‌లు అప్పు కావాలంటే ఎంద‌రెంద‌ర్నో ప్రాథేయ‌ప‌డాల్సిన దుస్థితి.

కానీ, రైతు సులభంగా రూ. 3 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం తెచ్చుకుని పంట పండించుకునేలా వీలు క‌ల్పించే ప్రభుత్వ పథకం ఒకటుందని ఎంతమందికి తెలుసు?

అవును... రైతుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ)తో రూ. 3 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు.

వ్యవసాయం

ఇంతకీ ఏమిటీ కిసాన్ క్రెడిట్ కార్డు, దీన్ని ఎలా పొందాలి?

ఎలా ఉపయోగించుకోవాలి?

రుణం తీసుకోవడానికి నిబంధనలేమిటి?

వడ్డీ ఎంత? తిరిగి తీర్చడం ఎలా? వంటి అన్ని వివరాలూ ఈ కథనంలో..

వ్యవసాయం

ఏమిటీ కిసాన్ క్రెడిట్ కార్డు?

పంట వేయ‌డానికి ముందు, త‌రువాత పెట్టుబ‌డుల‌కు కావాల్సిన డ‌బ్బు త‌క్కువ వ‌డ్డీతో, సులభ పద్ధతిలో రుణం అందించే ల‌క్ష్యంతో 1998లో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌క‌మే ఈ కిసాన్ క్రెడిట్ కార్డు.

నేష‌న‌ల్ బ్యాంకు ఫ‌ర్ అగ్రిక‌ల్చ‌ర్ అండ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ (నాబార్డ్) ఈ ప‌థ‌కాన్ని రూపొందించింది.

దీనికి సంబంధించి రిజ‌ర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఎప్ప‌టిక‌ప్పుడు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను నిర్దేశిస్తుంటుంది. 2004 నుంచి ఈ ప‌థ‌కాన్ని మ‌రింత సుల‌భ‌త‌రం చేయ‌డంతో పాటు ఈ ప‌థ‌కాన్ని వ్య‌వ‌సాయేత‌ర రంగాల్లో కూడా పెట్టుబ‌డులు పెట్ట‌డానికి విస్తరించారు.

2022లో పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టిన ఎక‌నమిక్ స‌ర్వే ప్ర‌కారం.. 2022 జ‌న‌వ‌రి నెల నాటికి దేశంలో బ్యాంకులు 2.70 కోట్ల మంది అర్హులైన రైతుల‌కు కిసాన్ క్రెడిట్ కార్డుల‌ను అందజేశాయి.

ఆత్మ‌నిర్భర్ భార‌త్ ప్యాకేజీ కింద కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో 2.50 కోట్ల మంది రైతుల‌కు కిసాన్ క్రెడిట్ కార్డులు అంద‌జేసి వారందరికీ రూ. 2 ల‌క్ష‌ల కోట్ల రుణాలు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

వ్యవసాయం

ఎంత అప్పు ఇస్తారంటే?

సాగు కోసం అయ్యే పెట్టుబ‌డుల కోసం గ‌రిష్ఠంగా రూ. 3 ల‌క్ష‌ల వ‌ర‌కు స్వ‌ల్ప‌కాలిక‌, దీర్ఘ కాలిక రుణాలు పొంద‌వ‌చ్చు.

ఎక్కువ‌గా స్వ‌ల్ప‌కాలిక రుణాలే ఇస్తుంటారు. దీర్ఘ‌కాలిక రుణాలు అనేది ఆయా బ్యాంకుల విచ‌క్ష‌ణాధికారాల‌ను బ‌ట్టి ఉంటుంది

వ్య‌వ‌సాయానికి సంబంధించి అన్ని ర‌కాల పెట్టుబ‌డుల‌కు రుణాలు ఇస్తారు.

విత్త‌నాలు, ఎరువులు, పురుగుల మందులు కొన‌డానికి, పొలం దున్న‌డానికి అయ్యే ఖ‌ర్చు, కూలీల‌క‌య్యే ఖ‌ర్చులు, పంట కోత‌ల‌కు అయ్యే ఖ‌ర్చుల‌ను భ‌రించ‌డానికి, మార్కెటింగ్ ఖ‌ర్చుల‌కు కూడా ఈ రుణాలు ఇస్తారు.

పాడి ప‌శువులు కొన‌డానికి, పంపుసెట్లు లాంటి వ్య‌సాయ ప‌రిక‌రాలు కొనుడానికి రుణం ఇస్తారు.

వ్యవసాయం

ఉచిత బీమా కూడా

కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతుల‌కు ఉచిత బీమా స‌దుపాయం కూడా కల్పిస్తున్నారు.

ఈ కార్డుదారుల‌కు ఏదైనా ప్ర‌మాదం సంభ‌వించి శాశ్వ‌త వైక‌ల్యం కలిగినా, మ‌ర‌ణించినా రూ. 50 వేల వ‌ర‌కు పరిహారం ఇచ్చేలా ఉచిత బీమా సదుపాయం ఉంది.

ఇత‌ర రిస్కుల‌కు రూ. 25 వేల బీమా ఉంది.

అర్హులైన రైతుల‌కు ఈ కిసాన్ క్రెడిట్ కార్డుతో పాటు అద‌నంగా ఆక‌ర్ష‌ణీయ‌మైన వ‌డ్డీ రేటుతో డెబిట్ కార్డు, స్మార్ట్ కార్డు, పొదుపు ఖాతాల‌ను జారీ చేస్తారు.

రుణానికి పూచీక‌త్తు అవ‌స‌ర‌మా?

కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతుల‌కు రూ.1.60ల‌క్ష‌ల వ‌ర‌కు ఎలాంటి పూచీక‌త్తు లేకుండా బ్యాంకులు త‌క్కువ వ‌డ్డీపై రుణాలు ఇస్తాయి.

అంత‌కంటే ఎక్కువ కావాలంటే పూచీక‌త్తు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

గోధుమ, వరి, మొక్కజొన్న, టమోటా.. టన్నుల కొద్దీ విత్తనాలను చైనా అంతరిక్షంలో తీసుకెళ్లి ఏం చేస్తోంది?

భారత్‌లో మతపరమైన ఆచారాలు పర్యావరణ పరిరక్షణకు ఎలా ఉపయోగపడుతున్నాయి?

ఎలా తిరిగి చెల్లించాలి?

కిసాన్ క్రెడిట్ కార్డు కింద రుణాల‌న్నీ ఆయా పంట‌ల సాగు కోసం అయ్యే పెట్టుబ‌డుల కోసం ఇచ్చే రుణాలు మాత్ర‌మే కావ‌డంతో ఈ రుణాల‌న్నీ దాదాపుగా స్వ‌ల్ప‌కాలిక రుణాలు మాత్ర‌మే ఉంటాయి.

రుణాలు ఐదేళ్ల వ‌ర‌కు పొంద‌వ‌చ్చు. అలాగే తిరిగి చెల్లించ‌డం కూడా పంట కాలం ముగిసిన త‌రువాత చెల్లించ‌వ‌చ్చు.

ఉదాహ‌ర‌ణ‌కు భార‌తీయ స్టేట్ బ్యాంకులో రుణం తీసుకున్నార‌నుకోండి.

ఖ‌రీఫ్‌లో ఒక పంట కోసం తీసుకున్న రుణాన్ని ఆ సీజ‌న్ ముగిసిన తరువాత వచ్చే జ‌న‌వ‌రి 31వ తేదీ లోపు చెల్లించేయాలి.

ర‌బీలో ఒక పంట కోసం తీసుకున్న రుణాన్ని ఆ సీజ‌న్ ముగిశాక జులై 31వ తేదీలోపు చెల్లించేయాలి.

ర‌బీ, ఖ‌రీఫ్ సీజ‌న్ల‌లో ఏక పంట‌కు కాకుండా రెండు లేదా మూడు పంట‌ల‌కు క‌లిపి రుణం తీసుకున్న‌ట్ల‌యితే ఆ రుణాల‌ను జులై 31వ తేదీలోపు చెల్లించాల్సి ఉంటుంది.

దీర్ఘ‌కాలిక పంటలకు రుణాలు తీసుకున్న‌ట్ల‌యితే రుణం తీసుకున్న తేదీ నుంచి ఏడాదిలోపు చెల్లించాల్సి ఉంటుంది.

రైతులు ఈ రుణాల‌ను నేరుగా త‌మ కిసాన్ క్రెడిట్ ఖాతాలోనే జ‌మ చేయాలి.

రుణాలు తిరిగి చెల్లించాల్సిన తేదీలోపు రుణం తీసుకున్న సొమ్ము, వ‌డ్డీ, స‌ర్వీసు ఛార్జీల‌తో క‌లిపి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

ఎంత రుణం వ‌స్తుందో తెలుసుకోవ‌డ‌మెలా?

కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఒక రైతు తాను ఎంత రుణం పొంద‌డానికి అర్హుడో కూడా ఇట్టే తెలుసుకోవ‌చ్చు.

అందుకోసం ఆయా బ్యాంకులే ఆన్‌లైన్లో కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ క్యాలిక్యులేట‌ర్ల‌ను కూడా అందుబాటులో ఉంచుతున్నాయి.

ఉదాహరణకు:

https://www.icicibank.com/calculators/kisan-credit-card-calculator.html

https://www.pnbindia.in/kcc-eligibility-calculator.aspx

ఏ ప్రాతిప‌దిక‌న రుణం మంజూరు చేస్తారు?

కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతుకు రుణం మంజూరు ఐదు సంవ‌త్స‌రాల పాటు వివిధ ద‌శ‌ల్లో ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు రెండు ఎక‌రాలు సాగు చేస్తున్న చిన్న‌కారు రైతును తీసుకుందాం. మొద‌టి సంవ‌త్స‌రం ఆ రైతు ఒక ఎక‌రాలో వ‌రి సాగు, మ‌రో ఎక‌రాలో చెర‌కు పంట వేయాల‌ని అనుక‌ున్నాడు. అప్పుడు..

* వ‌రికి పెట్టుబ‌డి వ్య‌యం + పంట బీమా క‌లిపి ఎక‌రాకు అయ్యే ఖ‌ర్చు : రూ. 11,000

* చెర‌కు పెట్టుబ‌డి వ్య‌యం + పంట బీమా క‌లిపి ఎక‌రాకు అయ్యే ఖ‌ర్చు : రూ. 22,000

ఈ పంట‌ల‌కు మొద‌టి సంవ‌త్స‌రం రుణం ఎంతిస్తారంటే

* 1 ఎక‌రా వ‌రి, 1 ఎక‌రా చెర‌కు పంట సాగుక‌య్యే ఖ‌ర్చు (11,000 + 22,000)= : రూ. 33,000

* పంట కోత‌కు ముందు ఖ‌ర్చు త‌దిత‌రాలు 10 % అదనం : రూ. 3,300

* పొలం నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు 20 % అదనం : రూ. 6.600

__________________________

మొద‌టి సంవ‌త్స‌రం ఇచ్చే పంట రుణ ప‌రిమితి : రూ. 42,900

__________________________

త‌రువాత నాలుగు సంవ‌త్స‌రాల కాలానికి మొద‌టి సంవ‌త్స‌రం రుణ ప‌రిమితి ఏటా అదనంగా మ‌రో 10 % చొప్పున అదన‌పు వ్య‌యాన్ని జ‌త చేసి రుణంగా ఇస్తారు.

మొద‌టి ఏడాది రుణ ప‌రిమితి మొత్తం : రూ.42,900

2వ సంవ‌త్స‌రం దీనికి 10 % అదన‌పు వ్య‌యం క‌లిసి (42,900+4,300) : రూ.47,200

3వ సంవ‌త్స‌రం దీనికి 10% అదన‌పు వ్య‌యం క‌లిపి (47,900+4,700) : రూ.51,900

4వ సంవ‌త్స‌రం దీనికి 10% అదన‌పు వ్య‌యం క‌లిపి (51,900+5,200) : రూ.57,100

5వ సంవ‌త్స‌రం దీనికి 10% అదన‌పు వ్య‌యం క‌లిపి (57,100+5,700) : రూ.62,800

(ఆధారం: ఆర్‌బీఐ)

వ్యవసాయం

ఎవ‌రు అర్హులు?

సొంత భూమి ఉండి వ్య‌వ‌సాయం చేస్తున్న రైతులు, కౌలు రైతులు, షేర్ క్రాప‌ర్స్‌, లీజుదారులు.

స్వ‌యం స‌హాయ‌క సంఘాలు, స‌హ‌కార రైతులు, కౌలు రైతుల‌తో స‌హా రైతు భాగ‌స్వామ్య ప‌ర‌ప‌తి సంఘాలు.

చేప‌ల రైతులు, కోళ్ల రైతులు, పాడి రైతులు కూడా ఈ ప‌థ‌కానికి అర్హులే.

18 ఏళ్ల వ‌య‌సు నుంచి 75 ఏళ్ల వ‌య‌సు లోపు రైతులంతా ఈ ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

75 ఏళ్లు దాటినవారైతే..

ఒక‌ వేళ రైతుకు వ‌య‌సు 75 ఏళ్ల‌ు దాటితే అప్పుడు కూడా కిసాన్ క్రిడెట్ కార్డు పొంద‌వ‌చ్చు.

అయితే అప్పుడు ఈ రైతుతో పాటు ఆయ‌న చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన వార‌సుల్లో ఒక‌రు స‌హ రుణ‌గ్ర‌హీత (కో బారోవ‌ర్‌)గా ఉండాల్సి ఉంటుంది.

గంజాయిని బహిరంగంగా అమ్మేందుకు రంగం సిద్ధమవుతోందా?

అడవిలో కూలి పనులు చేసిన ఈ గిరిజన మహిళ.. రైతులకు రోల్ మోడల్‌ ఎలా అయ్యారు?

వ్యవసాయం

ఎక్క‌డి నుంచి పొందొచ్చు?

అన్ని జాతీయ బ్యాంకుల నుంచి, ప్రైవేటు బ్యాంకులు, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు త‌దిత‌ర బ్యాంకుల నుంచీ రైతులు కిసాన్ క్రెడిట్ కార్డును పొంద‌వ‌చ్చు.

కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం రూపే కార్డుల‌ను జారీ చేస్తోంది. ఈ కార్డుల‌ను ఉప‌యోగించి రైతులు ఈ రుణాలు పొంద‌వ‌చ్చు.

వడ్డీ ఎంత?

కిసాన్ క్రెడిట్ కార్డులపైన ఇచ్చే రుణాల‌కు బ్యాంకులు త‌క్కువ వ‌డ్డీని వ‌సూలు చేస్తున్నాయి.

క‌నిష్ఠంగా 7 శాతం నుంచి గ‌రిష్టంగా 14 శాతం వ‌ర‌కు వ‌డ్డీ ఉంటుంది.ఈ వ‌డ్డీ అనేది ఆయా బ్యాంకుల విధానాల‌ను బ‌ట్టి నిర్ణ‌యిస్తారు.

తీసుకున్న రుణాల‌ను స‌కాలంలో చెల్లించేసిన రైతుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం వ‌డ్డీలో కొంత రాయితీ కూడా ఇస్తుంది.

వ్యవసాయం

కొన్ని బ్యాంకు వ‌డ్డీ రేట్లు ఇలా ఉన్నాయి

భార‌తీయ స్టేట్ బ్యాంకు - 7 %

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు - 7 %

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు - 9 %

యాక్సిస్ బ్యాంకు - 8.85%

ఇండియ‌న్ ఓవ‌ర్సీస్ బ్యాంకు - 7%

యూకో బ్యాంకు - 7 %

ఐసీఐసీఐ బ్యాంకు - 9%

కిసాన్ క్రెడిట్ కార్డును పొంద‌డ‌మెలా?

కిసాన్ క్రెడిట్ కార్డుల‌ను రైతులు త‌మ‌కు ద‌గ్గ‌ర్లోని బ్యాంకుల‌కు వెళ్లి అక్క‌డ కిసాన్ క్రెడిట్ కార్డ్ దరఖాస్తు పూరించి ఇవ్వాలి.

ఈ దరఖాస్తు ఒక పేజ్ మాత్రమే ఉంటుంది.

దరఖాస్తు పరిశీలించిన తరువాత బ్యాంక్ అధికారులు కార్డు జారీ చేస్తారు.

బ్యాంకు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా ఈ కార్డుకు అప్లయ్ చేసుకోవచ్చు.

ఏమేం డాక్యుమెంట్లు ఇవ్వాలి?

* పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తు ఫార‌ం

* రెండు పాస్‌పోర్టు సైజు ఫోటోలు

* గుర్తింపు కార్డు (ఆధార్‌, పాన్ కార్డు, ఓట‌రు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సుల్లో ఏదో ఒక కార్డును గుర్తింపు కార్డుగా పొంద‌ప‌ర‌చ‌వ‌చ్చు.)

* అడ్ర‌స్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్సు వంటివి ఇవ్వాలి.

* రెవెన్యూ అధికారులు ధ్రువీకరించిన రైతు పొలం ప‌త్రాలు/ ప‌ట్టాదారు పాసుపుస్త‌కం.

సిబిల్ స్కోరు అవ‌స‌ర‌మా?

మామూలుగా అయితే అవ‌స‌రం లేదు. కానీ కొన్ని బ్యాంకులు మాత్రం ఈ రుణం మంజూరు చేయ‌డానికి సిబిల్ స్కోరును కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్నాయి.

750 పాయింట్ల‌కు పైన సిబిల్ స్కోరు ఉంటేనే కొన్ని బ్యాంకులు ఈ రుణాలు మంజూరు చేస్తున్నాయి.

అంత‌కంటే త‌క్కువ స్కోరు ఉంటే రుణాలు ఇవ్వ‌వు. నిజానికి రూ. 1,60,000 వ‌ర‌కు ఎలాంటి పూచీక‌త్తు లేకుండా ఈ ప‌థ‌కం కింద రైతుల‌కు రుణాలు మంజూరు చేయాలి.

వ్యవసాయం

రుణం సొమ్ము ఏటీఎంల నుంచీ తీసుకోవ‌చ్చు

కిసాన్ క్రెడిట్ కార్డున్న రైతు త‌న‌కు మంజూరైన రుణాన్ని త‌న కేసీసీ ద్వారా త‌న‌కు ద‌గ్గ‌ర్లోని ఏటీఎం ద్వారా తీసుకోవ‌చ్చు.

లేదంటే నేరుగా బ్యాంకుకు వెళ్లి న‌గ‌దు రూపంలోనూ రుణం బ్యాంకు బ్రాంచ్ నుంచే తీసుకోవ‌చ్చు.

ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో న‌గ‌దు చెల్లించకుండా కిసాన్ క్రెడిట్ కార్డు చెల్లింపులు చేయొచ్చు.

కిసాన్ క్రెడిట్ కార్డ్ రాకపోయినా, ఏదైనా సమస్య వచ్చినా కాల్ చేయాల్సిన నంబర్

కిసాన్ క్రెడిట్ కార్డుకు సంబంధించి రైతులకు ఏవైనా ఇబ్బందులున్నా, వివ‌రాలు కావాల‌న్నా సంప్రదించడానికి కేంద్ర ప్ర‌భుత్వం ఒక కాల్ సెంట‌ర్‌ను కూడా ఏర్పాటు చేసింది.

ఈ కాల్ సెంట‌ర్ టోల్ ఫ్రీ నెంబ‌ర్లు 1800115526 , 011-24300606.

ఈ ప‌థ‌కం గురించి స‌మ‌గ్ర స‌మాచారం కోసం ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో ఈ పేజీని విజిట్ చేయొచ్చు.

'బ్యాంకింగ్ రంగంలో మంచి పథకం.. రైతులందరికీ ఉపయోగపడాలి’

భార‌త‌దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి ఇన్నేళ్ల‌యినా ఇప్ప‌టికీ దేశంలో రైతుల‌కు ఫార్మ‌ల్ బ్యాంకింగ్ సెక్ట‌ర్ నుంచి రుణాలు పొంద‌డం చాలా క‌ష్ట‌త‌రంగానే ఉంటోందని విజయవాడకు చెందిన ఆర్థిక రంగ నిపుణుడు, న్యాయవాది ఎస్. అనంత్ చెప్పారు.

'భార‌తీయ రిజ‌ర్వు బ్యాంకు 1951లో చేప‌ట్టిన ఆలిండియా క్రెడిట్ స‌ర్వే ప్ర‌కారం అప్ప‌ట్లో రైతుల‌కు కేవ‌లం 3 శాతం మాత్రం ఫార్మ‌ల్ బ్యాంకింగ్ రంగం నుంచీ రుణాలు అందేవి. దీన్ని బాగా పెంచాల‌నే ల‌క్ష్యం పెట్టుకుంది.

ఆ దిశ‌గా ఎన్నో ప్ర‌య‌త్నాలు జ‌రిగినా ఇప్ప‌టికీ రైతుల‌కు ఫార్మ‌ల్ బ్యాంకింగ్ సెక్టారు నుంచీ అందుతున్న రుణాలు దాదాపు 30 శాతానికి మించ‌డం లేదు.

ఇన్‌ఫార్మ‌ల్ సెక్టార్ నుంచే ఇప్ప‌టికీ రైతులు అధిక వ‌డ్డీల‌కు రుణాలు తీసుకుని అప్పుల‌పాలై అవ‌స్థ‌లు ప‌డుతున్నారు.

ఈ త‌రుణంలో కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ప‌థ‌కం అనేది అటు బ్యాంకింగ్ రంగంలోనూ ఇటు వ్య‌వ‌సాయ‌రంగంలోనూ ఒక అద్భుత‌మైన ప‌థ‌కంగా భావించ‌వ‌చ్చు.

ఈ ప‌థ‌కం వ‌ల్ల రైతులు సాగు ద్వారా ఆదాయ స‌ముపార్జ‌న‌కు రుణాలు స‌కాలంలో పొందే వీలుంటుంది.

పైగా ఇత‌ర‌త్రా రంగాల్లో రుణాలు ఒక నిర్దిష్ట ల‌క్ష్యం, అవ‌స‌రాల కోసం తీసుకున్న‌ప్ప‌టికీ కూడా చాలా వ‌ర‌కు ఆ రుణాన్ని ఇత‌ర‌త్రా అవ‌స‌రాల‌కు వాడుతున్న సంద‌ర్భాలు ఎక్కువ‌. కానీ వ్య‌వ‌సాయ‌రంగంలో రైతుల‌కు ఇచ్చే రుణాల విష‌యంలో ఇది చాలా వ‌ర‌కు త‌క్కువ‌గానే ఉంటుంది.

రైతులు తాము తీసుకున్న రుణాలను త‌మ పంట పొలాల‌పైనే వ‌చ్చిస్తారు. పైగా స‌కాలంలో త‌క్కువ వ‌డ్డీకి త‌మ పంట‌ల‌కు కావాల్సిన పెట్టుబ‌డి రుణాన్ని పొందే వీలు క‌ల్పించ‌డం ఈ ప‌థ‌కం ప్ర‌త్యేక‌త‌.

ఏ విధంగా చూసినా రైతుల‌కు ఇది ఎంతో ప్ర‌యోజ‌న‌క‌ర‌మైంద‌న‌డంలో సందేహం లేదు.

అయితే, దీన్ని పూర్తిస్థాయిలో రైతులు ఉపయోగించుకునేలా చూస్తే లక్ష్యం నెరవేరుతుంది’ అన్నారు అనంత్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Kisan Credit Card: Rs. 3 lakh loan can be drawn from ATM
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X