డీకే శివకుమార్ చేతులు ఊపుకుంటూ ఢిల్లీ వెళ్లలేదు, ఆయన ఐదు డిమాండ్లు ఇవే !
బెంగళూరు/న్యూఢిల్లీ: కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ తీరుతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో తాడోపేడో తేల్చుకోవాలని ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన పనులు నేను చెయ్యలేదా ?, తనను బీజేపీ నాయకులు వేధింపులకు గురి చేస్తున్నా, జైల్లో పెట్టినా తాను కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టలేదని డీకే శివకుమార్ అంటున్నారు.
2019లో రెబల్ ఎమ్మెల్యేలను మళ్లీ పార్టీలోకి తీసుకురావడానికి నేను ఒక్కడినే నానా తిప్పలు పడుతున్న సమయంలో తన వెంట కర్ణాటకకు చెందిన ఎంత మంది నాయకులు తన వెంట ముంబాయి వచ్చారని డీకే శివకుమార్ ప్రశ్నిస్తున్నారని తెలిసింది. ఢిల్లీ పెద్దల బుజ్జగింపులు, రాజీ చర్చలు జరిపిన తరువాత డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లారు.

డీకే శివకుమార్ ఢిల్లీకి ఒట్టి చేతులతో వెళ్లలేదని, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముందు ఐదు డిమాండ్లు పెట్టడానికి ఆయన సిద్దం అయ్యారని వెలుగు చూసింది. సీఎం సీటు సిద్దరామయ్యకు, డీకే శివవకుమార్ 50-50 ప్రతిపాదన ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దం అయ్యింది. ఇలాంటి సమయంలో డీకే శివకుమార్ ఐదు డిమాండ్లతో ఢిల్లీ వెళ్లారని ఆయన సన్నిహితులు అంటున్నారు.
డీకే శివకుమార్ డిమాండ్లు !
1. కేపీసీసీ అధ్యక్షుడిని నియమించే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలి. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాత్రమే కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చెయ్యాలని కేపీసీసీ అధ్యక్షుడు, సీఎం అభ్యర్థి రేసులో ఉన్న డీకే శివకుమార్ డిమాండ్ చేస్తున్నారని సమాచారం.
2. సీఎం పదవిని రెండున్న సంవత్సరాలు ఒకరికి, మరో రెండున్నర సంవత్సరాలు ఒకరికి ఇవ్వాలని అనుకుంటే మొదటి చాన్స్ కేపీసీసీ అధ్యక్షుడు అయిన తనకే ఇవ్వాలని డీకే. శివకుమార్ డిమాండ్ చేస్తున్నారు. సిద్దరామయ్య ఇప్పటికే ఒకసారి సీఎం అయ్యారని, మొదట తనను సీఎం చేసి తరువాత సిద్దరామయ్యను సీఎం చెయ్యాలని డీకే శివకుమార్ అంటున్నారని తెలిసింది.

3. కేపీసీసీ అధ్యక్షుడి నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాము. కాంగ్రెస్ పార్టీ సాంప్రధాయం ప్రకారం కేపీసీసీ అధ్యక్షుడిని సీఎం చెయ్యాలి, గతంలో కర్ణాటకలో కేపీసీసీ అధ్యక్షుడు అయిన ఎస్ఎం. కృష్ణను అలాగే సీఎం చేశారు. ఇప్పుడు తనను అలాగే సీఎం చెయ్యాలని డీకే శివకుమార్ డిమాండ్ చేస్తున్నారని తెలిసింది.
4. తాను సీఎం అవుతాననే ధీమాతో ఒక్కలిగ కులస్తులు జేడీఎస్ పార్టీకి ఓటు వెయ్యకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని, ఒకవేళ తనను సీఎం చెయ్యకపోతే 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఒక్కలిగుల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని గ్యారెంటీ లేదని డీకే శివకుమార్ హైకమాండ్ కు చెప్పాలని డిసైడ్ అయ్యారని తెలిసింది.
5. నేను కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైన కార్యకర్తను, కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రతిపని శక్తివంచన లేకుండా పూర్తి చేశాను. భారత్ జూడో యాత్ర కర్ణాటకలో విజయవంతం కావడానికి పని చేశాను, అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తిరిగి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేశానని, తన పనితీరు వలన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిఫలం వచ్చిందని డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముందు చెప్పాలని డిసైడ్ అయ్యారని తెలిసింది. అయితే డీకే శివకుమార్ డిమాండ్లు విన్న కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కన్నడిగులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications