KSRTC: ఏపీ, తెలంగాణకు కర్ణాటక బస్సులు షురూ: అడ్వాన్స్ బుకింగ్ కూడా: ఎప్పటి నుంచి?
బెంగళూరు: రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతోన్నాయి. రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. సెకెండ్ వేవ్ తీవ్రత ప్రారంభం కావడానికి ముందునాటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని- తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లాక్‌డౌన్‌ను మొత్తంగా ఎత్తేసింది. ఎలాంటి ఆంక్షలను అమలు చేయట్లేదు. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో కర్ఫ్యూ సడలింపులు ఉన్నాయే తప్ప పూర్తిగా తొలగించలేదక్కడి ప్రభుత్వం. ఇదివరకు ఉన్న కర్ఫ్యూ సమయాన్ని మరింత పొడిగించింది. కర్ణాటకలోనూ ఇదే తరహా పరిస్థితులు ఉన్నాయి. కర్ఫ్యూ సమయాన్ని సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది.
దీనితోపాటు అంతర్రాష్ట్ర వాహనాల రాకపోకలపై ఇదివరకు ఉన్న ఆంక్షలను కూడా కర్ణాటక ప్రభుత్వం తొలగించింది. ఈ దిశగా మరో అడుగు ముందుకేసింది. ఏపీ, తెలంగాణకు ఆర్టీసీ బస్సులను నడిపించనున్నట్లు ప్రకటించింది. మంగళవారం తెల్లవారు జాము నుంచి కేెస్ఆర్టీసీ బస్సులు రెండు తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తాయి. 50 శాతం సీటింగ్ కెపాసిటీకి మాత్రమే అనుమతి ఇస్తామని కేఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యాన్ని కూడా పునరుద్ధరించినట్లు తెలిపారు. www.ksrtc.in వెబ్‌సైట్ ద్వారా ప్రయాణికులు తమ టికెట్లను ముందుగా రిజర్వేషన్ చేసుకోవచ్చని అన్నారు.

అన్ని జిల్లాల నుంచి ఏపీ, తెలంగాణల్లోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలకు ఆర్టీసీ బస్సులను నడిపిస్తామని అధికారులు తెలిపారు. తెల్లవారు జామున 6 గంటలకు నుంచి ఈ బస్సుల రాకపోకలు ఆరంభమౌతాయని చెప్పారు. సాయంత్రం 6 గంటల్లోగా అవన్నీ మళ్లీ స్వరాష్ట్రానికి తిరిగి వచ్చేలా బస్సు సర్వీసులను రీషెడ్యూల్ చేసినట్లు పేర్కొన్నారు. తెల్లవారు జామున 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే బస్సులు నడుస్తాయని స్పష్టం చేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఇందులో మార్పులు ఉండబోవని అన్నారు. తొలి బస్ సర్వీసు మంగళవారం తెల్లవారు జామున 6 గంటలకు ఆరంభమౌతుందని వివరించారు.












Click it and Unblock the Notifications