లఖింపూర్ ఖేరీ ఘటన: సిట్ విచారణ పర్యవేక్షించనున్న జస్టిస్ రాకేష్ కుమార్ జైన్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరి ఘటనపై దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతలను ఓ విశ్రాంత న్యాయమూర్తికి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్-హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ జైన్ ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తారని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
న్యాయబద్ధంగా, స్వతంత్రంగా ఈ కేసు దర్యాప్తు జరిగేలా రాకేష్ జైన్ దర్యాప్తును పర్యవేక్షిస్తారని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. లఖింపూర్ ఖేరీ ఘటనపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను సుప్రీంకోర్టు చేర్చింది. వారు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు కానందున దర్యాప్తు బృందంలో నియమిస్తున్నట్లు స్పష్టం చేసింది.

సిట్ విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించిన తర్వాత ఈ కేసు విచారణ మరోసారి చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. కాగా, అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరీలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపై ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మృతి చెందారు.
ఆ తర్వాత తీవ్ర ఆగ్రహంతో రైతులు దాడి చేయడంతో మరో నలుగురు మృతి చెందారు. వీరిలో వాహన డ్రైవర్ తోపాటు బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. 8 మంది మరణతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, ఈ ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కోవడంతో అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications