వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో భూముల ధరలు పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు - ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
వాణిజ్య సముదాయాల్లో అన్ని ఫ్లోర్లకు ఒకే మార్కెట్ విలువను నిర్ణయించారు

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ భూముల మార్కెట్ విలువలు 50 శాతం, ఖాళీ స్థలాలవి 35 శాతం, అపార్ట్‌మెంట్ ఫ్లాట్ల విలువను 25-30 శాతం పెంచాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించినట్లు ఈనాడు పత్రిక తెలిపింది.

ఆ శాఖ రాష్ట్ర కార్యాలయంలో గురువారం సుదీర్ఘ కసరత్తు తరువాత ఈ ప్రతిపాదనలను జిల్లా రిజిస్ట్రార్‌లకు అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్లతో రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ టెలీకాంఫరెన్స్ నిర్వహించారు. శుక్ర, శనివారాల్లో ప్రతిపాదనలను ఆమోదించి పంపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో మార్కెట్ విలువల కమిటీకి అదనపు కలెక్టర్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీవోలు ఛైర్మన్లుగా వ్యవహరిస్తున్నారు. కమిటీలో సభ్యులుగా ఉండే అధికారులందరూ ఒకే చోట సమావేశమై ప్రక్రియ ముగించాలని సూచించారు.

సవరించిన మార్కెట్ విలువలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం కలెక్టర్లకు సమాచారం ఇచ్చింది.

ప్రస్తుతం అమల్లో ఉన్న మార్కెట్ విలువలకు, ప్రతిపాదించిన విలువల మధ్య సరాసరి వ్యత్యాసం 35-40 శాతం ఉంది. ప్రభుత్వ మార్కెట్ విలువలకు రెండు మూడు రెట్లు అధికంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్న వాటిని అత్యధిక ప్రాధాన్య ప్రాంతాలుగా గుర్తించారు.

వాణిజ్య సముదాయాల్లో అన్ని ఫ్లోర్లకు ఒకే మార్కెట్ విలువను నిర్ణయించారు. స్థలల విలువల సగటు 35 శాతం పెరిగింది. తక్కువ విలువ ఉన్న ప్రాంతాల్లో 50 శాతం వరకూ హెచ్చింది. అపార్ట్‌మెంట్లలో చదరపు అడుగుకు 25-30 శాతం దాకా పెంచారు. వ్యవసాయ భూముల మార్కెట్ విలువ 50 శాతం పెరిగింది.

ఒకటో తేదీ నుంచి ఆస్తుల మార్కెట్ విలువలు పెరగనున్న నేపథ్యంలో పాత ధరల్లో గురువారం రిజిస్ట్రేషన్లు భారీగా జరిగాయి.

'ఐపీఎస్‌లూ జాగ్రత్త...వచ్చేది బీజేపీ ప్రభుత్వమే'.. బండి సంజయ్

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని, ఐపీఎస్‌ అధికారులు జాగ్రత్తగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హెచ్చరించారని సాక్షి ఓ కథనంలో తెలిపింది.

తెలంగాణలో నిజాంను మించిన అరాచక పాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ ఒక్క ఏడాది మాత్రమే ఉంటుందని, ఆ తరువాత వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు.

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ నియోజకవర్గంలో మంగళవారం ఎంపీ అర్వింద్, బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో గాయపడిన వారిని పరామర్శించేందుకు బండి సంజయ్‌ గురువారం జిల్లాలో పర్యటించారు.

ఈ సందర్భంగా నందిపేట మండల కేంద్రంలో ఆయన విలేఖ్రులతో మాట్లాడుతూ, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారులు గూండాలను పెంచిపోషిస్తే చరిత్ర హీనులవుతారన్నారు. కేసీఆర్‌ మోచేతి నీళ్లు తాగుతున్న కొందరు ఐపీఎస్‌ అధికారులు ఇష్టం వచ్చినట్లు దాడులను ప్రోత్సహిస్తున్నారన్నారు.

ఎంపీ అర్వింద్‌కు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తిరిగే వీలు లేనివిధంగా నిజామాబాద్‌ సీపీ వ్యవహరించి హక్కులకు భంగం కలిగించారన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన సీపీ, ఎంపీని వెనక్కు వెళ్లాలని చెప్పడమేమిటన్నారు.

దాడికి పాల్పడిన నేరస్తులు బహిరంగంగా తిరుగుతుంటే ఇప్పటివరకు హత్యాయత్నం కేసు నమోదు చేయలేదన్నారు. దీన్ని బట్టి సీపీ నేతృత్వంలోనే ఎంపీపై హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోందన్నారు. ఎంపీపై దాడి జరిగితే ముఖ్యమంత్రి ఎలాగూ మాట్లాడరు, కనీసం డీజీపీ సైతం స్పందించలేదన్నారు.

మరోవైపు రైతులు దాడి చేసినట్లు బుకాయిస్తున్నారన్నారు. పంజాబ్‌లో మాదిరిగా రైతుల పేరుతో ప్రధానిపై దాడికి యత్నించిన ఖలిస్తాన్‌ తీవ్రవాదులతో టీఆర్‌ఎస్‌కు సంబంధాలు ఉన్నాఏమో కేసీఆర్‌ చెప్పాలన్నారు.

కేసీఆర్‌ ప్రభుత్వం గవర్నర్‌ను సైతం గౌరవించని విధంగా సంస్కారహీనంగా తయారైందని బండి సంజయ్‌ పేర్కొన్నారు. గవర్నర్‌ అన్నింటికీ తలూపకుండా ప్రశ్నిస్తే చెడ్డవారిగా టీఆర్‌ఎస్‌ నాయకత్వం భావిస్తోందన్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌ ఎన్నికల ఓటమి నేపథ్యంలో కేసీఆర్‌ నిస్పృహలో ఉన్నారన్నారు. ప్రజలు రాష్ట్రంలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో సీఎం తమ పార్టీ నాయకులపై దాడులను ప్రోత్సహిస్తున్నారన్నారు.

ఏపీ సేవ పోర్టల్ ప్రారంభం

పౌర సేవలను మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవల పోర్టల్‌ను ప్రారంభించిందని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

గురువారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దీన్ని ప్రారంభించారు. దీన్ని ఏపీ సేవ పోర్టల్‌గా పిలవనున్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ప్రజలు తామిచ్చిన అర్జీ ఎక్కడుంది? ఏ స్థాయిలో ఉంది? ఎవరి దగ్గర ఎన్ని రోజుల నుంచి పెండింగ్‌లో ఉంది? అన్న విషయాలను నేరుగా తెలుసుకునేందుకు ఈ పోర్టల్‌తో వీలవుతుందన్నారు. దరఖాస్తుదారుడితో పాటు సంబంధిత శాఖలోని పైస్థాయి అధికారులు కూడా ఈ విషయాలను తెలుసుకోవచ్చన్నారు. దీనివల్ల వేగం, బాధ్యత పెరుగుతుందని చెప్పారు.

''ఈ సేవలన్నింటినీ పూర్తిగా డిజిటలైజ్‌ చేస్తున్నాం. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల నుంచి మండల, మున్సిపాల్టీ స్థాయి, ఆ తర్వాత జిల్లా స్థాయి, రాష్ట్ర సచివాలయం వరకు ఉన్నతాధికారులంతా ఒకే డిజిటల్‌ ప్లాట్‌ఫాం వేదికగా పనిచేస్తారు. ఈ పోర్టల్‌ వల్ల ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎవరైనా లంచాలు అడిగితే దానిపై కూడా ఫిర్యాదు చేసే అవకాశం పోర్టల్‌లో కల్పిస్తాం. ప్రజలు ఏదైనా సేవకు సంబంధించి దరఖాస్తు చేయగానే రశీదు వస్తుంది. పరిష్కారానికి ఎంత సమయం పడుతుందో కూడా చెబుతారు. ఫీజులు చెల్లించాల్సి ఉంటే ఈ పోర్టల్‌ సాయంతో చెల్లించవచ్చు. యూపీఐ, క్యూఆర్‌కోడ్‌ స్కానింగ్‌, క్యాష్‌ పేమెంట్‌ ద్వారా కానీ ఆన్‌లైన్‌లో కానీ చెల్లించే వెసులుబాటు ఉంటుంది. ఈ పోర్టల్‌లోకి రెవెన్యూ, భూ పరిపాలనకు సంబంధించిన 35 రకాల సేవలు, మున్సిపాల్టీలకు చెందిన 25 సేవలు, పౌరసరఫరాల శాఖకు చెందిన 6 సేవలు, విద్యుత్‌ రంగానికి చెందిన 53 సేవలు, గ్రామీణాభివృద్ధికి చెందిన 3 సేవలను కూడా తెచ్చాం. ఈ పోర్టల్‌ కింద సమీపంలోని సచివాలయం నుంచే కాకుండా ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకోవచ్చు’’ అని జగన్‌ పేర్కొన్నారు.

'బీజేపీ దళిత వ్యతిరేకి' .. కడియం శ్రీహరి

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దళిత వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతూ రాజ్యాంగం ద్వారా సిద్ధించిన రిజర్వేషన్లను సైతం ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తున్నదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆరోపించారని నమస్తే తెలంగాణ పత్రిక తెలిపింది.

గురువారం హనుమకొండ జిల్లా ఎక్సైజ్‌కాలనీలోని నివాసంలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసి మాట్లాడారు.

గత ఎనిమిదేండ్లుగా దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్రం ఒక్క కొత్త పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉపాధి, ఉద్యోగావకాశాలను కల్పించకుండా ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ దళితుల బతుకులను రోడ్డుపాలు చేస్తున్నదని మండిపడ్డారు.

దళితుల ఆహారపు అలవాట్లని నియంత్రిస్తూ దాడులు చేస్తూ అవమానపరుస్తున్నారని, దళితులపై బీజేపీ కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రానికి, బీజేపీకి దళితులపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, దళితుల జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు చేపట్టాలని, దేశవ్యాప్తంగా దళితబంధును అమలు చేయాలని డిమాండ్ చేశారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Land prices increase in Telangana,Implemented from February 1
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X