నాకేమీ తెలియదు!: ప్రధాని నరేంద్ర మోడీతో కర్ణాటక సీఎం కీలక భేటీ, నాయకత్వ మార్పుపై స్పందన
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు విషయంపై గత కొంత కాలంగా తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. రాష్ట్ర రాజకీయాలు, అభివృద్ధి పనులపై కీలకంగా చర్చించినట్లు తెలుస్తోంది.
శుక్రవారం ప్రత్యేక విమానంలో సీఎం యడ్యూరప్ప ఢిల్లీకి వెళ్లారు. యడ్యూరప్ప వెంట రాష్ట్ర మంత్రులు ఎవరూ రాలేదు. అయితే, యడ్యూరప్ప కుమారుడు మాత్రం ఆయన వెంటే ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు.

కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉంటుందా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అలాంటిదేం లేదని చెప్పారు. సీఎం మార్పు గురించి తనకేమీ తెలియదని బదులిచ్చారు. అంతేగాక, ఏదైనా ఉంటే మీరే చెప్పాలంటూ మీడియా ప్రతినిధులను ఎదురు ప్రశ్నించారు.
కర్ణాటక రాష్ట్రంలో అభివృద్ధి పనుల అమలు వేగవంతం కోసం సాయం చేయాలని ప్రధానిని కోరినట్లు యడ్యూరప్ప తెలిపారు. కేబినెట్ విస్తరణపై ప్రశ్నించగా.. పార్టీ సీనియర్లతో ఈ విషయంపై ఏదైనా చర్చ జరిగినప్పుడు మీకు తెలియజేస్తానంటూ మీడియాకు సమాధానమిచ్చారు.
ఇటీవల కేంద్ర కేబినెట్ విస్తరణలో చోటు దక్కించుకున్న కర్ణాటక ఎంపీ శోభా కరంద్లాజే సహా పలువురు కేంద్రమంత్రులను యడ్యూరప్ప శుక్రవారం కలుసుకున్నారు. శనివారం కూడా ఢిల్లీలోనే ఉండి హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ కానున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications