అఖిలేశ్‌కు ఉద్బోధ : మోడీపై ములాయం ఇలాంటి వ్యాఖ్యలా!
హైదరాబాద్ : పార్టీ నిలువునా చీలిపోయే పరిస్థితుల్లో.. ఎస్పీ అధినేత ములాయం సింగ్ ప్రధాని మోడీని గుర్తు చేస్తూ పార్టీ నేతల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేయడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అఖిలేశ్ యాదవ్-శివపాల్ యాదవ్ మధ్య అంతర్గత పోరుతో.. పార్టీ విబేధాలు తారాస్థాయికి వెళ్లిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో.. పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని సద్దుమణిగించేందుకు ములాయం సింగ్ లక్నోలో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. భేటీ సందర్భంగా.. ప్రధాని మోడీ ప్రస్తావని తీసుకొచ్చిన ములాయం.. పరోక్షంగా ఆయన్ను ఆదర్శవంతుడిగా చెప్పుకురావడం హాట్ టాపిక్ గా మారింది.

" ప్రధాని మోదీని చూడండి. పేద కుటుంబం నుంచి వచ్చినా.. నిరంతర శ్రమతో ప్రధానమంత్రి స్థాయికి చేరుకున్నారు. ఆయన అంకిత భావం చాలా గొప్పది. తన తల్లిని ఎన్నటికీ వీడనని ఎల్లవేళలా ఆయన చెబుతూనే ఉంటారు. మోదీకి తన తల్లి ఎలాగో, నాకు శివపాల్ యాదవ్, అమర్ సింగ్ అంతే. వారిద్దరిని కూడా నేను ఎన్నటికీ వదలను" అంటూ అఖిలేశ్ కు ఉద్బోధ చేశారు ములాయం.
ఎప్పుడూ మోడీపై విరుచుకుపడే ములాయం.. ఇప్పుడు ఆయనపై ప్రశంసలు కురిపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇదే సందర్బంగా.. తన తమ్ముడు శివపాల్ చేసిన కృషిని తాను ఎన్నడూ మరవనని ములాయం చెప్పారు. అమర్ సింగ్ ను తాను సొంత తమ్ముడిలా భావిస్తానని, కష్ట సమయాల్లో ఎన్నోసార్లు తన వెన్నంటే నిలిచాడని అన్నారు. అమర్ చేసిన తప్పులన్నీ మాఫీ అయిపోయాయని, ఇక ఆయన్ను తప్పుబట్టాల్సిన అవసరమేమి లేదన్నారు. చివరగా.. వీరిద్దరినీ తాను ఎప్పటికీ వదులుకోలునేది లేదని ములాయం తేల్చి చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications