
విభేదాలు వీడండి.. విజయంపై దృష్టి పెట్టండి : పంజాబ్‌లో రాహుల్ పర్యటన
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. పటిష్టంగా ఉన్న పార్టీని నేతల మధ్య మనస్పర్థలు ఎక్కడి దారితీస్తాయో అన్న భయం పట్టుకుంది. పంజాబ్‌లో పట్టుకోల్పోకుండా మరో సారి అధికారం చేపట్టాలంటే నాయకుల మధ్య ఐక్యత ముఖ్యమని అధినాయకత్వం భావించింది. పార్టీలో అగ్రనేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు పంజాబ్‌లో పర్యటిస్తున్నారు.

పార్టీ నేతలకు రాహుల్ హితబోధన
పంజాబ్ సీఎం చరణ్ జిత్ సిగ్ చన్నీ, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూలతో కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ సమావేశమైయ్యారు. విభేదాలు వీడాలని వారికి హితబోధన చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జలంధర్‌లో రాహుల్ గాంధీ పర్యటించారు. పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ పడుతున్న సిద్ధూ, చన్నీలను ఉద్దేశిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీకి ఇద్దరు నాయకులు సారధ్యం వహించలేరు.. ఒకరే నాయకత్వం వహించగలరని చురకలంటించారు.

సీఎం ఎంపికపై పంజాబీలదే నిర్ణయం
పంజాబ్ కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు కోరుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. సీఎం అభ్యర్థిగా ఎవరో కావాలో తేల్చుకోవాలని పార్టీ కార్యకర్తలను కోరుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పార్టీలో విబేధాలను పక్కపెట్టి అసెంబ్లీలో గెలుపుకోసం కృషి చేయాలని కోరారు. మరో సారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాల్సిన అవసరం ఉందన్నారు. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దని.. విపక్షాలకు ఎత్తులను చిత్తు చేస్తూ పార్టీ శ్రేణులు ముందుకు వెళ్లాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.

నామమాత్రపు నేతగా ఉండను.. సిద్ధూ
సీఎం చన్నీ, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూతో రాహుల్ గాంధీ ప్రత్యేకంగా రాష్ట్రంలో ఎన్నికల పరిస్థితులపై చర్చించారు. సీఎం అభ్యర్థి ఎంపికపై రాహుల్ గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇద్దరూ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో విజయం కోసం అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు. క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తగా పనిచేస్తామన్నారు. ఈసందర్బంగా తనకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని, నామమాత్రపు నేతగా ఉండబోనని సిద్ధూ.. రాహుల్ వద్ద పేర్కొన్నట్లు సమాచారం. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత సీఎం పోస్టు కోసం ఆశ పడడంలేదని చెప్పారు..

ఐక్యంగా ఉంటాం..
అటు సీఎం చరణ సింగ్ చన్నీ కూడా తాము ఐక్యంగా ఉంటామని రాహుల్ గాంధీకి హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తాను ఏపదవి కోసం పోటీపడని తెలిపారు. పార్టీ నిర్ణయం మేరకు కట్టుబడి ఉంటామని చెప్పారు. సిద్ధూ తనకు సన్నిహితుడని పేర్కొన్నారు. ఆయన కోసం ప్రచారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చన్నీ చెప్పారు. అంతకు ముందు రాహుల్ గాంధీ అమృతసర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. అనంతరం అమరవీరుల స్మారకమైన జలియన్‌వాలా బాఘ్‌ను సందర్శించారు.