టిడిపి అవిశ్వాసం తిరకాసు: అద్వానీ ఝలక్?
న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానానికి బిజెపి మద్దతు సంపాదించాలని భావించిన తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులకు నిరాశ ఎదురైనట్లు సమాచారం. విభజనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే మద్దతు ఇవ్వబోమని బిజెపి చెప్పడంతో తెలుగుదేశం వ్యూహాత్మకంగా అవినీతిపై, ధరల పెరుగుదలపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చింది.
తమ అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని కోరడానికి తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు బిజెపి నేతలు అద్వానీని, ఎం. వెంకయ్యనాయుడిని కోరారు. అయితే, వారు మద్దతు ఇవ్వడానికి నిరాకరించినట్లు సమాచారం. కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు, వైయస్సార్ కాంగ్రెసు సభ్యులు విభజనపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు.

విభజనపై తప్ప ఇతర అంశాలపై అవిశ్వాసం ప్రతిపాదిస్తే మద్దతు ఇచ్చే విషయంపై ఆలోచిస్తామని చెప్పడంతో తెలుగుదేశం సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల్లో ఆశలు పెరిగాయి. దీంతో వారు విభజనపై కాకుండా ఇతర అంశాలపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు. అవిశ్వాస తీర్మానాలపై బిజెపి తీవ్రంగా చర్చించినట్లు సమాచారం. మేలో సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం లేదని, పెద్దగా సమయం కూడా లేదు కాబట్టి ప్రభుత్వాన్ని పడగొట్టడం వల్ల తమకు అదనంగా చేకూరే ప్రయోజనం ఏదీ లేదని బిజెపి నాయకత్వం భావించినట్లు సమాచారం.
పైగా, తెలుగుదేశం ఏం చెబుతున్నప్పటికీ రాష్ట్ర విభజనను ఆపడానికే అవిశ్వాసానికి నోటీసు ఇచ్చిందనే విషయం అర్థం కాని విషయమేమీ కాదని, దానికి మద్దతు ఇస్తే ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రాంతంలో వ్యతిరేకత ఎదరవుతుందని బిజెపి భావించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు సహకరించడం ద్వారా తెలంగాణలో ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలనే ప్రయత్నాలకు అది విఘాతం కలిగిస్తుందని అనుకున్నట్లు చెబుతున్నారు.
అవిశ్వాస తీర్మానం విషయంలో బిజెపి జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులను కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తే ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదని, పైగా వ్యతిరేక ఫలితం ఇస్తుందని వారు చెప్పినట్లు తెలుస్తోంది. అందువల్లనే బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి హైదరాబాదులో ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు. తాము అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదన ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications