కాంగ్రెస్ పరువు తీసిన మమత..
Mamata Banerjee: దేశం.. ఎన్నికల ఏడాదిలో ప్రవేశించింది. రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. మార్చిలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.

ఈ క్రమంలో ఇండియా కూటమికి బిగ్ షాక్ ఇచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ.. కాంగ్రెస్ పార్టీపై తన దాడిని మరింత తీవ్రతరం చేశారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొన్నటికి మొన్న కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకున్నట్లు ప్రకటించిన ఈ ఫైర్ బ్రాండ్ ఇప్పుడు మరోసారి సంచలనం రేపారు.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కనీసం 40 సీట్లను కూడా గెలుచుకోవడం కష్టమేనని మమత బెనర్జీ తేల్చి చెప్పారు. దేశంలో 300 నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే తాను కాంగ్రెస్‌కు సూచించానని, దీన్ని పట్టించుకోవట్లేదని అన్నారు. అధిక స్థానాల నుంచి పోటీ చేయాలని భావిస్తోందని, ఇది సరికాదని చెప్పారు.
300 సీట్లల్లో పోటీ చేసినా కనీసం 40 చోట్లయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారా? లేదా? అనేది అనుమానమేనని మమత బెనర్జీ అన్నారు. పూర్తిగా ముస్లిం ఓటుబ్యాంక్ మీదే కాంగ్రెస్ ఆధారపడినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పొత్తులో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో రెండు లోక్‌సభ స్థానాలను ఆఫర్ చేశానని, ఇంకా ఎక్కువ కోరారని గుర్తు చేశారామె.
పశ్చిమ బెంగాల్‌లో రాజకీయంగా కాంగ్రెస్ నేతలు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోన్నారని, ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ.. తనకు కనీస సమాచారం ఇవ్వట్లేదని మమత బెనర్జీ ఆరోపించారు. కాంగ్రెస్‌కు అంత బలమే ఉంటే ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ల్లో ఓడించగలదా? అంటూ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications