Delimitation Bill: ఓటింగ్ లో నెగ్గిన కేంద్రం-లోక్ సభలో డీలిమిటేషన్ చర్చ..!
లోక్ సభతో పాటు దేశవ్యాప్తంగా చట్ట సభల్లో సీట్ల పెంపు కోసం జరగాల్సిన నియోజకవర్గాల పునర్విభజన (delimitation 2026) కోసం 131వ రాజ్యాంగ సవరణ చేసేందుకు రంగం సిద్దమైంది. ఈ మేరకు నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్రం ప్రతిపాదించిన బిల్లుపై లోక్ సభ చర్చించాలా వద్దా అనే అంశంపై స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు. ఇందులో కేంద్రానికి మద్దతుగా ఎక్కువ ఓట్లు రావడంతో లోక్ సభ ఈ బిల్లుపై చర్చ చేపడుతున్నట్లు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, 2026 (delimitation bill) ను ఇవాళ లోక్ సభలో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం లోక్‌సభ సభ్యుల సంఖ్యను ప్రస్తుతమున్న 550 నుండి గరిష్టంగా 850కి పెంచాలని ప్రతిపాదించింది. ఇందులో రాష్ట్రాల నుండి 815 మంది, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 35 మంది సభ్యులు ఉంటారు. ఈ బిల్లుపై లోక్ సభలో చర్చ ప్రారంభమైంది. అలాగే మహిళా బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీట్ల పెంపుకు ఉద్దేశించి మరో బిల్లు కలిపి మొత్తం మూడు బిల్లుల్ని ఇవాళ న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టారు.

2023లో ఆమోదించబడిన నారీ శక్తి వందన అధినియమ్ (మహిళా రిజర్వేషన్ బిల్లు) అమలుకు మార్గం సుగమం చేసేందుకు కేంద్రం ఇవాళ లోక్‌సభలో కీలక సవరణ బిల్లులను ప్రవేశపెట్టింది. ఈ ప్రక్రియకు ప్రధానమైన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును ప్రవేశపెట్టేందుకు జరిగిన ఓటింగ్‌లో 251 మంది ఎంపీలు అనుకూలంగా, 185 మంది వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆమోదం లభించింది. మొత్తం 409 మంది సభ్యులు ఓటు వేయగా, ఎవరూ గైర్హాజరు కాలేదు. లోక్‌సభలోని ప్రతిపక్ష సభ్యులు రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, 2026ను ప్రవేశపెట్టడంపై ఓటింగ్ విభజన జరపాలని పట్టుబట్టగా, టీ.ఆర్.బాలు, అసదుద్దీన్ ఒవైసీలతో సహా డీఎంకే, ఏఐఎంఐఎం, టీఎంసీ, సీపీఐ(ఎం)లకు చెందిన ఎంపీలు ఈ చర్యను వ్యతిరేకించారు. పార్లమెంటరీ నిబంధనల ప్రకారం, రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడానికి సాధారణ మెజారిటీ అవసరం కాగా, దాని తుది ఆమోదానికి ప్రత్యేక మెజారిటీ అవసరం - అంటే, మొత్తం సభ్యత్వంలో 50 శాతానికి పైగా మరియు ప్రతి సభలో హాజరై ఓటు వేసే సభ్యులలో మూడింట రెండు వంతుల మంది మద్దతు కావాలి.












Click it and Unblock the Notifications