Lok Sabha Election 2024: పదేళ్ల తర్వాత రాజస్తాన్ లో బోణీ కొట్టబోతున్న కాంగ్రెస్..!
ఎడారి రాష్ట్రమైన రాజస్తాన్ లో ఈసారి లోక్ సభ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతున్నాయి. మొత్తం 25 సీట్లలో ఈ నెల 12 సీట్లకకు తొలి దశ పోలింగ్ ముగిసింది. ఇప్పుడు రెండో దశలో భాగంగా రేపు (శుక్రవారం) మిగిలిన 13 సీట్లలో ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. దీంతో రాజస్తాన్ లో లోక్ సభ ఎన్నికలు పూర్తవుతాయి. అయితే ఈసారి ఎన్నికల్లో చెప్పుకోవాల్సిన అంశాల్లో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల విరామం తర్వాత బోణీ కొట్టబోతుండటమే.
2014, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజస్తాన్ లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టలేకపోయింది. కేంద్రంలో యూపీఏ అధికారాన్ని కోల్పోయిన తర్వాత రాజస్తాన్ లోనూ కాంగ్రెస్ పార్టీ అంతంతమాత్రంగా మారింది. అయితే ఐదేళ్లకోసారి ప్రభుత్వాల్ని మార్చే అలవాటున్న రాజస్తాన్ ప్రజలు ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. అయితే అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య ఆధిపత్య పోరుతో గతేడాది కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది.

రాజస్తాన్ లో ఈసారి జరుగుతున్న లోక్ సభ పోరులో మాత్రం కాంగ్రెస్ పార్టీని ప్రజలు కొంత మేర ఆదరించే అవకాశాలున్నట్లు పలు సర్వేలు చెప్తున్నాయి. బీజేపీతో పోటాపోటీగా కాకపోయినా గణనీయంగా ఎంపీ సీట్లను కాంగ్రెస్ పార్టీ తిరిగి కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఇక్కడ మోడీ ఛరిష్మాతో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు సాధించిన బీజేపీకి ఈసారి జాతీయ వాదం, రామమందిరం వంటి అంశాలు ఉన్నా పూర్తిగా కలిసి రావడం లేదనే వాదన వినిపిస్తోంది.
ఈసారి రాజస్తాన్ లో కుల రాజకీయాలు కొన్ని స్థానాల్లో ఓటర్లపై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. రెండో దశలో కీలకమైన నియోజకవర్గాలు బార్మర్-జైసల్మేర్, బన్స్వారా, జలోర్, కోట, జోధ్‌పూర్, టోంక్ వంటి సీట్లలో ఈ ప్రభావం కనిపపిస్తోంది.
అందుకే మోడీ రాజస్తాన్ ప్రచారంలో ముస్లింలపై తీవ్ర వ్యాఖ్యలకు దిగినట్లు తెలుస్తోంది. అలాగే ఇక్కడ జరిగిన మొదటి దశ పోలింగ్ తగ్గడం కూడా బీజేపీని టెన్షన్ లోకి నెడుతోంది.
ఈసారి రాజస్తాన్ ఎంపీ ఎన్నికల బరిలో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, గోవింద్ సింగ్ దోతస్రా వంటి అగ్రనేతలు పోటీలో ఉన్నారు. అయినా రాహుల్, ప్రియాంక, సోనియా, ఖర్గే వంటి నేతలు ఈసారి ప్రచారంలో కనిపించలేదు. తొలిదశలో సోనియా మాత్రం కనిపించారు. రాజ్ పుట్ లు బీజేపీకి ఎదురు తిరగడం, ఇతర కారణాలతో కాంగ్రెస్ ఈసారి కనీస స్ధానాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోటా, బార్మర్, టోంక్ వంటి స్ధానాలను ఈసారి కాంగ్రెస్ గెల్చుకోవచ్చని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications