లోక్ సభ స్పీకర్ కీలక నిర్ణయం-ఎంపీల తోపులాట ఎఫెక్ట్..!
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇవాళ్టితో ముగియబోతున్న తరుణంలో నిన్న అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. పార్లమెంట్ లో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ను కించ పరిచేలా హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య చిచ్చు రేపాయి. ఇన్నాళ్లు మాటల యుద్దానికే పరిమితమైన ఎంపీలు నిన్న బాహాబాహీకి దిగారు. పార్లమెంట్ ప్రాంగణంలోనే పోటాపోటీ నిరసనలు చేపట్టిన ఎంపీలు.. పరస్పరం తోసుకున్నారు. ఇందులో ఇద్దరు బీజేపీ ఎంపీలకు గాయాలయ్యాయి.
దేశ అత్యున్నత చట్ట సభ అయిన పార్లమెంట్ ప్రాంగణంలో హుందాగా మసలుకోవాల్సిన ఎంపీలు ఇలా పరస్పరం తోసుకుని గాయాలపాలవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయినా వీరిని నియంత్రించేందుకు చట్ట సభల స్పీకర్లు, ఛైర్మన్లు ఏం చేస్తున్నారనే ప్రశ్నలూ తలెత్తాయి. ఈ నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పార్లమెంట్ గేట్ వద్ద నిరసనల్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై గేటు వద్ద ఎలాంటి నిరసనల్నీ అనుమతించకూడదని ఆదేశాలు ఇచ్చారు.

పార్లమెంట్ ప్రాంగణంలో ఉన్న గేట్ల వద్ద ఏ రాజకీయ పార్టీ కానీ, అందులో సభ్యుడైన ఎంపీ కానీ, కొందరు ఎంపీల గ్రూపు కానీ ఎలాంటి నిరసనలు చేపట్టేందుకు ఇకపై అనుమతించరు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎంపీలకు హెచ్చరికలు వెళ్లాయి. పార్లమెంట్ ప్రాంగణంలో నిన్న ఎంపీల మధ్య తోపులాటలు, పరస్పరం కేసులు పెట్టుకోవడం, బీజేపీకి చెందిన ఓ మహిళా ఎంపీ విపక్ష నేత రాహుల్ గాంధీ తనను బెదిరించారంటూ చేసిన ఆరోపణల నేపథ్యంలో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications