రూ. 7,000 కోట్ల లాటరీ స్కాం కేసు: సీబీఐకి సవాలు
బెంగళూరు: లాటరి స్కాం కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలలో విచారణ చెయ్యడానికి సిద్దం అవుతున్నది. ఈ కేసు దర్యాప్తు సీబీఐ అధికారులకు సవాలుగా మారింది. తమిళనాడు లాటరీ కింగ్ పిన్ మార్టీన్ గురించి ఆరా తీస్తున్నారు.
ఒకటి కాదు రెండు కాదు రూ. 7,000 కోట్ల లాటరీ స్కాం కేసులో పలువురిని విచారణ చెయ్యడానికి సీబీఐ సిద్దం అయ్యింది. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన మార్టీన్ అలియాస్ లాటరీ మార్టీన్ ను విచారించి పూర్తి వివరాలు బయటకు లాగాలని సీబీఐ భావిస్తున్నది.
తమిళనాడు లాటరీ ఏజెంట్ అయిన మార్టీన్ ను గతంలో పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అక్రమ లాటరీలు నిర్వహించిన అతను బెయిల్ మీద బయటకు వచ్చాడు. తరువాత కర్ణాటక లాటరీ ఏజెంట్ పారి రాజన్ తో సంబంధాలు పెట్టుకున్నాడు.

కర్ణాటకలోని ఐపీఎస్ అధికారులు, పోలీసు అధికారులు వీరిద్దరికి అండగా నిలవడంతో అక్రమ లాటరీ దందాను విచ్చలవిడిగా నిర్వహించారనే ఆరోపణలున్నాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు ఈశాన్య రాష్ట్రాలలో వీరి ఈ లాటరీ దందాకు అడ్డుఅదుపు లేకుండ పోయిందని అంటారు.
చివరికి కేసు దర్యాప్తు చేసిన సీఐడి అధికారులు కోలారు జిల్లా బంగారు పేటకు చెందిన పారి రాజన్ ను అరెస్టు చేశారు. పారి రాజన్ అరెస్టు తో అవినీతి ఐపీఎస్ అధికారుల గుట్టురట్టు అయ్యింది. ఈ కేసులో రాజకీయ నాయకులు, బడా నేతలు ఉన్నారని బయటపడటంతో కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించారు.
లాటరీ మార్టీన్ సుమారు రూ. 2,000 కోట్లు సంపాదించాడని, తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వెళ్లాడని వెలుగు చూసింది. తమిళనాడులోని ఒక రాజకీయ పార్టీ అండతో లాటరీ మార్టీన్ చెలరేగిపోయాడని విచారణలో బయటపడింది.
మార్టీన్ నువిచారణ చేసి ఈ లాటరీ స్కాంలో ఇంకా ఎంత మంది పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు ఉన్నారు అని పూర్తి వివరాలు సేకరించాలని సీబీఐ అధికారులు బావిస్తున్నారు. లాటరీ మార్టీన్ ఇప్పటికే అండర్ గ్రౌండ్ లో తలదాచుకున్నాడని తెలిసింది.












Click it and Unblock the Notifications