రైళ్లలో భోజనం బంద్! ప్రయాణికులకు IRCTC షాక్
పశ్చిమాసియాలో ముదురుతున్న సంఘర్షణలు భారతీయ రైల్వే క్యాటరింగ్ వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టాయి. దేశవ్యాప్తంగా వాణిజ్య (Commercial) ఎల్పీజీ సిలిండర్ల సరఫరా గణనీయంగా తగ్గడంతో, రైళ్లలో ప్రయాణికులకు వండిన వేడి భోజనాన్ని అందించడం ఐఆర్‌సీటీసీకి సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో, భోజన సేవలు తాత్కాలికంగా నిలిచిపోయే అవకాశం ఉందని భావించిన అధికారులు, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.
ఎల్పీజీ కొరతను ఎదుర్కోవడానికి ఐఆర్‌సీటీసీ (IRCTC) మార్చి 10న తన క్యాటరింగ్ లైసెన్సీలు.. వెండర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రైల్వే స్టేషన్లలోని ఫుడ్ ప్లాజాలు, రిఫ్రెష్‌మెంట్ రూమ్‌లు.. జన ఆహార్ అవుట్‌లెట్‌లలో గ్యాస్ సిలిండర్లకు బదులుగా మైక్రోవేవ్ ఓవెన్లు, ఇండక్షన్ స్టవ్‌లు వంటి విద్యుత్ ఆధారిత వంట పద్ధతులకు మారాలని సూచించింది. అలాగే, అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికుల ఆకలి తీర్చడానికి 'రెడీ టూ ఈట్' (Ready-to-eat) ఆహార పదార్థాలను భారీగా అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.

IRCTC రీఫండ్‌ల హామీ.. రోజుకు 17 లక్షల భోజనాలు!
భారతీయ రైల్వే తన బేస్ కిచెన్‌ల ద్వారా ప్రతిరోజూ సుమారు 17 లక్షల భోజనాలను ప్రయాణికులకు సరఫరా చేస్తోంది. ఒకవేళ గ్యాస్ కొరత కారణంగా భోజనం అందించలేకపోతే, టికెట్ బుకింగ్ సమయంలోనే ముందస్తుగా (Pre-booked) ఆహారం కోసం చెల్లించిన డబ్బులను ప్రయాణికులకు తిరిగి చెల్లించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. లాజిస్టికల్ సవాళ్లు ఎదురైనప్పటికీ, ఆహార సేవల్లో ఎక్కడా విరామం రాకుండా చూడటమే తమ ప్రాధాన్యతని ఐఆర్‌సీటీసీ పేర్కొంది.
సామాన్యుడిపై కొరత సెగ
యుద్ధం కారణంగా దిగుమతులు తగ్గడంతో, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. దీనివల్ల కమర్షియల్ సిలిండర్ల బుకింగ్ వ్యవధి పెరిగి, కృత్రిమ కొరత ఏర్పడింది. ఈ ప్రభావంతో ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. కొన్ని చోట్ల హాస్టళ్లు, మెస్‌లు గ్యాస్ దొరక్క కట్టెల పొయ్యిలు, బొగ్గు కుంపట్లపై వంట చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైల్వే వ్యవస్థలో కూడా ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.












Click it and Unblock the Notifications