బెంగళూరులో ఓటు వేసిన వెంకయ్య నాయుడు
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ)లో బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు జోస్యం చెప్పారు. బెంగళూరులో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన మనవి చేశారు.
శనివారం ఉదయం బెంగళూరు నగరంలోని మల్లేశ్వరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

తాను బీజేపీకి ఓటు వెయ్యాలని పిలువునివ్వడం లేదని, మీకు ఇష్టం వచ్చిన పార్టీకి ఓటు వేసుకోవచ్చని, అయితే ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. మీకు ఇష్టం వచ్చిన నాయకుడిని గెలిపించుకోవాలని వెంకయ్య నాయుడు చెప్పారు.
ప్రపంచ దేశాలలో బెంగళూరు నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. బెంగళూరు ఎన్నికల గురించి యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురు చూస్తుందని గుర్తు చేశారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు ఎవరు కల్పిస్తారో వారిని గెలిపించుకోవాలని వెంకయ్య నాయుడు అన్నారు. వెంకయ్య నాయుడు వ్యాఖ్యలతో బీజేపీ నాయకులు కంగు తిన్నారు.












Click it and Unblock the Notifications