అమ్ములపొది నుంచి ఆకాష్ను బయటికి తీసిన భారత ఆర్మీ
India Pakistan War: పాకిస్తాన్‌పై ప్రతీకార యుద్ధానికి దిగింది భారత్. జమ్మూ కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ పొడవునా డ్రోన్లు, మిస్సైళ్లతో పాకిస్తాన్ సాగించిన దాడిని తిప్పికొట్టింది. కౌంటర్ అటాక్ చేపట్టింది. రాజధాని ఇస్లామాబాద్, లాహోర్, సియాల్‌కోట్ వంటి నగరాలపై విరుచుకుపడింది.
తొలుత పాకిస్తాన్ గురువారం రాత్రి జమ్మూ కాశ్మీర్‌పై భారీ ఎత్తున దాడికి పాల్పడింది. తొలుత డ్రోన్లతో దాడి చేసింది. ఆ తరువాత మోర్టార్ షెల్స్‌తో విరుచుకుపడింది. అనంతరం మిస్సైళ్లనూ సంధించింది. మొత్తంగా ఎనిమిది మిస్సైళ్లను ప్రయోగించగా.. వాటన్నింటినీ కూడా భారత ఆర్మీ మధ్యలోనే ఇంటర్‌సెప్ట్ అయింది. వాటిని కూల్చివేసింది.

ఈ మిస్సైళ్ల దాడిని నిలువరించడంలో ఆకాష్ గగనతల రక్షణ క్షిపణిని ఉపయోగించినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. డ్రోన్ అటాక్‌ను నిర్వీర్యం చేయడంలో ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థనీయంగా పని చేసిందని, వందశాతం స్ట్రైక్ రేట్ అందుకుందని పేర్కొంది. అంచనాలకు అనుగుణంగా రాణించిందని తెలిపింది.
మేడిన్ ఇండియా మిస్సైల్ ఇది. ఆత్మనిర్బర్ భారత్ కింద పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) దీనికి రూపకల్పన చేసింది. ఉపరితలం నుంచి గగనతలంలో దూసుకొచ్చే శతృమూకల డ్రోన్లు, మిస్సైళ్లను కొట్టి అవతలపడేసే సామర్థ్యం దీనికి ఉంది. 25 కిలోమీటర్ల పరిథిలోని లక్ష్యాలను ఛేదించగల సత్తా ఈ మిడిల్ రేంజ్ మిస్సైల్ సొంతం.
రక్షణశాఖ అమ్ముల పొదిలో అత్యంత కీలకం, ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆకాశ్ మిస్సైల్ సిస్టమ్‌ను విదేశాలకు సైతం ఎగుమతి చేయాలని అప్పట్లో నిర్ణయించింది కేంద్రం. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు 2020లో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం అయిదు బిలియన్ డాలర్ల విలువైన రక్షణ రంగ ఉత్పత్తులను ఎగుమతి చేయాలనే ఉద్దేశంతో అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం.
మల్టిపుల్ ఎయిర్ అటాక్స్.. అంటే ఒకేసారి ఒకటికి మించి దూసుకొచ్చే మిస్సైళ్లు గానీ, డ్రోన్లను గానీ నేలకూల్చగలుగుతుందీ క్షిపణి. రియల్- టైమ్ మల్టీ సెన్సార్డ్ డేటా ప్రాసెసింగ్, దాడి తీవ్రతను ముందుగానే అంచనా వేయగలదు. ఏ దిశ నుండి దాడులు సంభవించినా ఏకకాలంలో వాటిని చేధిస్తుంది.
గురువారం రాత్రి పాకిస్తాన్ సాయుధ దళాలు జమ్మూ కాశ్మీర్ పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు, మిస్సైళ్లు సంధించినప్పుడు వాటిని అడ్డుకోవడానికి ఆకాష్ క్షిపణిని విజయవంతంగా ఉపయోగించినట్లు భారత ఆర్మీ తెలిపింది. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడటానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది.












Click it and Unblock the Notifications