మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-భారీగా ఓటింగ్ ...
ఉత్తరాది రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనల మధ్య దాదాపు ప్రశాంతంగా ముగిసింది. మధ్యప్రదేశ్ లో 230 సీట్లకు ఒకేసారి ఇవాళ పోలింగ్ నిర్వహించారు. అలాగే ఛత్తీస్ ఘడ్ లోని 70 సీట్లలో రెండోదశ పోలింగ్ జరిగింది. ఇరు రాష్ట్రాల్లోనూ ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్.. ఆ తర్వాత వేగం పుంజుకుంది. చివర్లో ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలిరావడంతో పోలింగ్ శాతాలు భారీగా నమోదయ్యే అవకాశముంది.
నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఉండటంతో ఇరు రాష్ట్రాల్లోనూ పోలింగ్ సమయాల్లో మార్పులు చేశారు. మధ్యప్రదేశ్ లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ను ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నిర్వహించారు. మిగతా ప్రాంతాల్లో మాత్రం ఉదయ 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ నిర్వహించారు. ఛత్తీస్ ఘడ్ లో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ నిర్వహించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకూ పోలింగ్ జరిగింది.

సాయంత్రం 5 గంటల వరకూ ఈసీ ప్రకటించిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్ లో దాదాపు 71శాతం పైగా పోలింగ్ జరిగింది. అలాగే ఛత్తీస్ ఘడ్ లో 67 శాతం వరకూ పోలింగ్ నమోదైంది. సాయంత్రం పోలింగ్ సమయం ముగిసిన తర్వాత క్యూలో ఉన్న వారు కూడా ఓటు వేస్తున్నారు. ఇది కూడా పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘం అధికారికంగా పోలింగ్ పూర్తి వివరాలు ప్రకటించబోతోంది. ఈ లెక్కన చూస్తే ఇరు రాష్ట్రాల్లోనూ భారీగానే పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది.
మరోవైపు ఛత్తీస్ ఘడ్ లో అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. గరియాబంద్ జిల్లాలో మావోయిస్టులు పెట్టిన ఐఈడీ పేలడంతో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృత్యువాత పడ్డారు. మరో జవాన్ గాయాలపాలయ్యారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లో ఎన్నికలు పూర్తి కావడంతో డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.












Click it and Unblock the Notifications