వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యప్రదేశ్: 'మతాంతర వివాహం చేసుకున్నందుకే మా ఇల్లు కూలగొట్టారు'

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఆసిఫ్, సాక్షి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. మతాలు వేరు కాబట్టి తమ ప్రేమను సమాజం అంగీకరించదని వారికి తెలుసు. కానీ, ఇంతలోనే అధికారులు వచ్చి వారి ఇంటిని కూల్చేశారు.

ఏప్రిల్ 8న, మధ్యప్రదేశ్ అధికారులు, ఆసిఫ్ ఇల్లు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినదంటూ కూల్చేశారు. దీనిపై బీబీసీ స్పందన అడిగినప్పుడు స్థానిక అధికారులు వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.

madhyapradesh

మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లా కలెక్టర్ దీనిపై ట్వీట్ చేశారు. ''ఆసిఫ్ ఖాన్ ఇల్లు, దుకాణాలను అధికారులు కూల్చేశారు. గత రెండు రోజులుగా అసిఫ్ ఖాన్ అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నాం" అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

https://twitter.com/dindoridm/status/1512329757525913613

ఇటీవలి కాలంలో మధ్యప్రదేశ్ లో పలు ముస్లిం కుటుంబాలకు చెందిన ఇళ్లను అధికారులు ఎలాంటి నోటీసులు లేకుండానే కూల్చేశారు. అయితే, ఆసిఫ్ ఖాన్, సాక్షిల వ్యవహారం సీరియస్‌గా మారింది. ఇలాంటి పెళ్లిళ్లను హిందూ గ్రూపులు లవ్ జిహాద్ గా పేర్కొంటున్నాయి.

'అమ్మాయిని వెనక్కి పంపండి, పోలీసులకు ఫిర్యాదు చేయం'

ఏప్రిల్ 3వ తేదీ ఉదయం నుంచి ఈ వ్యవహారం మొదలైంది. ఆసిఫ్ ఫోన్‌కు వేర్వేరు నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయి. రంజాన్ కారణంగా అలసిపోయి నిద్రపోవడం వల్ల ఆసిఫ్ ఖాన్ ఫోన్ కాల్‌లకు సమాధానం ఇవ్వలేకపోయారు.

చివరకు కాల్ లిఫ్ట్ చేసినప్పుడు తనకు కాల్ చేస్తున్నది సాక్షి అని తెలిసింది. తన బంధువుల ఇంటి నుంచి పారిపోయి బయటకు వచ్చిన సాక్షి, ఆసిఫ్ కోసం ఎదురు చూస్తున్నారు.

వేరే వ్యక్తుల ఫోన్ నుంచి కాల్ చేయడానికి ఆమె అనేక ప్రయత్నాలు చేశారు. చివరకు ఆసిఫ్ కాల్ లిఫ్ట్ చేశారు.

కాల్ అందుకున్న ఆసిఫ్ వెంటనే లేచి సాక్షి ఉన్న చోటికి వెళ్లిపోయారు.

సాక్షి, ఆసిఫ్ ఇద్దరూ మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలోని ఒకే గ్రామానికి చెందినవారు. సాక్షి కుటుంబ సభ్యులకు ఆసిఫ్‌తో ఆమెకున్న సంబంధం గురించి ముందే తెలుసు.

తమ మతాలు భిన్నమైనందున హిందూత్వ సంస్థలు ఈ సంబంధాన్ని అంగీకరించవని వారు భయపడ్డారు. చివరకు అదే నిజమైంది.

సాక్షి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఈ వార్త కొన్ని గంటల్లోనే ఆ ప్రాంతమంతా పాకిపోయింది. హిందూ మత సంస్థలకు చెందిన కొందరు గ్రామంలో పోగయ్యారు. ఆందోళన నిర్వహించి రహదారిని మూసివేశారు. ఆసిఫ్ ఇల్లు, దుకాణం పగలగొట్టి సాక్షిని తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఆసిఫ్, సాక్షి అప్పటికి వేరే రాష్ట్రానికి వెళ్లిపోయి, పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసిఫ్‌ని వెనక్కి తీసుకురావాలని తండ్రి హలీమ్‌ఖాన్‌పై ఒత్తిడి పెరిగింది.

పోలీసుల ఎదుటే హలీమ్ ఖాన్ ఆసిఫ్, సాక్షిలతో మాట్లాడారు. అయితే, వారిద్దరూ తిరిగి రావడానికి సిద్ధంగా లేరు. తనను వేధిస్తే ఆత్మహత్య చేసుకుంటానని సాక్షి వారితో చెప్పారు. పోలీసులు కూడా వారితో మాట్లాడినా ఫలితం లేకపోయింది.

''మమ్మల్ని పోలీస్ స్టేషన్ రావాలని వారు అడిగారు, మేము అక్కడికి ఎలా వెళ్తాం, మా ప్రాణాలకు ప్రమాదం ఉంది. మమ్మల్ని వారు విడిచిపెట్టరు. అందుకే నేను ఆసిఫ్ తో కలిసి అక్కడికెళ్లడానికి ఇష్టపడలేదు'' అన్నారు సాక్షి.

ఆసిఫ్, సాక్షి రావడానికి నిరాకరించడంతో ఆసిఫ్ తండ్రి హలీంఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నిరసనలు మరింత ఉధృతమయ్యాయి.

భయంతో ఆసిఫ్ కుటుంబ సభ్యులు బంధువుల వద్ద ఆశ్రయంపొందారు. ఏప్రిల్ 7న, పోలీసులు ఆసిఫ్ షాపును, ఇంటిని ధ్వంసం చేశారు.

తాము ఎక్కడున్నది తెలిసిపోతుందన్న భయంతో మొబైల్ ‌ఫోన్‌లను వాడలేదని, తమ ఇల్లు, దుకాణం ధ్వంసం చేసిన వార్తను వేరొకరి మొబైల్ లో చూశానని ఆసిఫ్ వెల్లడించారు.

'నా బలం నా ప్రేమ'

సాక్షి, ఆసిఫ్‌లు తెలిపిన వివరాల ప్రకారం..వారు ఎవరికీ కనిపించకుండా తప్పించుకుని తిరిగారు. ఓ రోజు రైలులో వెళుతూ , తాను ఇష్టపూర్తిగానే ఆసిఫ్‌తో కలిసి వచ్చానని సాక్షి ఓ వీడియోను రికార్డు చేసి విడుదల చేశారు.

ఆసిఫ్‌ను తన ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని, అతనిపై నా కుటుంబ సభ్యులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఆసిఫ్ కుటుంబంపై తప్పుడు కేసు పెట్టారని సాక్షి ఆ వీడియోలో పేర్కొన్నారు.

ఆసిఫ్ కుటుంబ సభ్యులను మరింత వేధిస్తే ఆత్మహత్య చేసుకుంటానని సాక్షి హెచ్చరించారు.

ఈ వీడియోను విడుదల చేసినప్పుడు చాలా భయపడ్డానని సాక్షి చెప్పారు. ''పోలీసులు, మా కమ్యూనిటీ వారు మమ్మల్ని వెంటాడుతున్నారని మాకు అర్ధమైంది'' అని ఆమె వెల్లడించారు.

సాక్షి కుటుంబ సభ్యులు ఆసిఫ్‌ పై కిడ్నాప్ కేసు నమోదు చేయడంతో పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారు.

''నా ఉద్దేశాన్ని నిరూపించుకోవడానికి నాకు ఎలాంటి సాక్ష్యాలు అవసరం లేదు, నా ప్రేమే నా పెద్ద బలం' అని ఆసిఫ్ చెప్పారు.

గూగుల్ సాయంతో ఇంటికి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవాలయానికి వెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

''ఇది నవరాత్రుల సమయం. శుభ దినం. అందుకే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం'' అని సాక్షి చెప్పారు.

గ్రామంలోని సాక్షి సోదరుడు, తల్లి మాట్లాడేందుకు భయపడుతూనే, ముస్లింను సాక్షి పెళ్లి చేసుకోవడం తమకు ఇష్టం లేదని చెప్పారు. ఒకే గ్రామం కావడంతో ఇరు కుటుంబాలకు ఇంతకు ముందే బాగా తెలుసు.

తాము ఒకే స్కూల్‌లో చదువుకునేవారమని, పదేళ్ల కిందటే తమ మధ్య ప్రేమ మొదలైందని సాక్షి చెప్పారు. కుటుంబ సభ్యులు సంబంధం కోసం వెతకడం ప్రారంభించినప్పుడు, ఆసిఫ్‌తో తన పెళ్లి గురించి అందరి ముందు మాట్లాడాలని ఆమె ఆసిఫ్‌ను ఇంటికి పిలిచారు.

ముస్లిం కావడంతో అతన్ని పెళ్లి చేసుకోవడం కుదరదని, అనవసరమైన గొడవలు వస్తాయని అమ్మా, తమ్ముడు చెప్పినట్లు సాక్షి వెల్లడించారు. ''నన్ను ఇంట్లోనే బంధించారు. చదువు కూడా ఆగిపోయింది. మా అమ్మ కూడా నా బాధను అర్ధం చేసుకోలేకపోయింది'' అన్నారు సాక్షి.

సాక్షిని ఆపేందుకు ఆమె కుటుంబ సభ్యులు రకరకాల పద్ధతులను అనుసరించారు. ఒక తాంత్రికుడితో పూజలు కూడా చేయించారు. చివరకు ఆసిఫ్‌కు దూరంగా బంధువుల ఇంటికి పంపారు.

ఇరవై రోజుల తర్వాత అవకాశం చిక్కగానే, సాక్షి అక్కడి నుంచి పారిపోయారు. ప్రస్తుతం ఆసిఫ్‌, సాక్షి సురక్షిత ప్రాంతంలో తలదాచుకుంటున్నారు. మధ్యప్రదేశ్ వెలుపల ఉన్న కోర్టు వారికి భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది.

మరోవైపు హలీం ఖాన్ కూడా తన గ్రామాన్ని వదిలి వేరే ప్రాంతంలో ఉన్న తన భార్యను తీసుకుని అత్తమామల ఇంటికి వెళ్లారు. ఆయన కొడుకుల్లో ఒకరు గర్భవతి అయిన భార్యతో అత్తగారి ఇంట్లో ఉండగా, మరొక కుమారుడు బంధువుల ఇంట్లో ఉన్నారు.

'బయటి వ్యక్తులు వాతావరణాన్ని పాడు చేశారు'

హలీంఖాన్ తెలిపిన వివరాల ప్రకారం 1992లో గ్రామ పంచాయతీ ఆయనకు ఇల్లు కేటాయించింది.

''నాలుగు రోజుల తర్వాత నేను పోలీసు కస్టడీ నుండి విడుదలైనప్పుడు, తమ ఇంటిని కూల్చివేయకుండా అధికారులను ఎందుకు ఆపలేదని ఇరుగు పొరుగు వారిని అడిగాను'' అని హలీంఖాన్ చెప్పారు.

పోలీసులను ప్రతిచోటా మోహరించారని, ఎవరినీ బయటకు రానివ్వలేదని పొరుగువారు చెప్పినట్లు హలీంఖాన్ వెల్లడించారు.

తాను గ్రామంలో గౌరవప్రదమైన వ్యక్తినని, స్థానిక రాజకీయాల్లో కూడా చురుగ్గా పనిచేశానని హలీంఖాన్ చెప్పుకున్నారు. గ్రామంలో ఏ వివాదం వచ్చినా అధికారులను పిలిపించి పరిష్కరించే ప్రయత్నించేవాడినని ఆయన వెల్లడించారు.

బయటి నుంచి వచ్చిన కొందరు ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టి గ్రామంలో వాతావరణాన్ని చెడగొట్టారని, ఇప్పుడు తమ మాట వినేవారు లేరని హలీంఖాన్ వాపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Madhya Pradesh:'Our house was demolished because of inter-religious marriage'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X