Madhya Pradesh polls: ఐపీఎల్ టీమ్ కు పేరు సూచించండి-ఓటర్లను కోరిన కాంగ్రెస్ పార్టీ...
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. తమ మ్యానిఫెస్టోలో ఓ కీలక హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే మధ్యప్రదేశ్ తరఫున ఓ ఐపీఎల్ జట్టును తీసుకొస్తామని ప్రకటించింది. తద్వారా యువ ఓటర్లను ఆకట్టుకోవాలనేది ఆ పార్టీ లక్ష్యం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకేసి ఆ జట్టుకు పేరు కూడా సూచించాలని ఓటర్లను కోరింది. ఈ మేరకు సీఎం అభ్యర్ధి కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ ఓటర్లను కోరారు.
మధ్యప్రదేశ్ లో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉందన్న సర్వే అంచనాల నేపథ్యంలో ఇరు పార్టీలూ సర్వశక్తులొడ్డుతున్నాయి. ఇందులో భాగంగా అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఈ తరుణంలో కాంగ్రెస్ ఎంపీ నకుల్ నాథ్ ఐపీఎల్ టీమ్ పేరు చెప్పాలంటూ ఓటర్లను కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. నవంబర్ 17 రాష్ట్ర ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మధ్యప్రదేశ్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టును ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ గత నెలలో విడుదల చేసిన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.

దీనికి కొనసాగింపుగానే ఇవాళ మధ్యప్రదేశ్ ఐపీఎల్ టీమ్ పేరును సూచించాలని యువతకు కాంగ్రెస్ ఎంపీ నకుల్ నాథ్ విజ్ఞప్తి చేశారు. దీంతో ఇప్పటికే పేర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా ఎంపీ అయిన నకుల్ మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించేందుకు తాను మొగ్గుచూపుతున్నానని, క్రికెట్ రంగంలో రాష్ట్రానికి గర్వకారణం కావాలని కోరుకుంటున్నానని అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాలు తెచ్చిపెడతాయో డిసెంబర్ 3న తేలిపోనుంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలోని 230 సీట్లకు ఈ నెల 17న పోలింగ్ జరగబోతోంది.












Click it and Unblock the Notifications