Madhya Pradesh Polls: మధ్యప్రదేశ్ లో బీజేపీకి పనికిరాని హిందూత్వ కార్డు ! సీన్ రివర్స్..
కేంద్రంలో 2014లో ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందీ రాష్ట్రాల్లో హిందూత్వ రాజకీయాలకు పదునుపెట్టిన బీజేపీకి ఈసారి మాత్రం ఆ పరిస్ధితి కనిపించడం లేదు. ముఖ్యంగా ఒకప్పుడు హిందూత్వ కార్డుతో ఎన్నో ఎన్నికలు గెలిచిన బీజేపీకి ఇప్పుడు మారుతున్న సీన్ చుక్కలు చూపిస్తోంది. హిందీ హార్ట్ ల్యాండ్ గా చెప్పుకునే మధ్యప్రదేశ్ లో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హిందూత్వ కార్డు కాషాయ పార్టీకి పూర్తిగా ఎదురుతన్నే పరిస్దితులు కనిపిస్తున్నాయి.
తాజాగా మధ్యప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా .. అయోధ్య రామాలయం నిర్మాణం విషయంలో బీజేపీని గతంలో కాంగ్రెస్ అవమానించేదంటూ ఎగతాళి చేశారు. ఇప్పుడు రామాలయ ప్రారంభ తేదీ ఖరారైందని, ఇప్పుడేమంటారని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ స్పందించలేదు. కానీ బీజేపీ మాత్రం అయోధ్య రామమందిరం ఫోటోల్ని తమ ప్రచారంలో వాడేస్తోంది. దీనిపై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.

కానీ బీజేపీ అంచనాలకు విరుద్ధంగా రామ మందిరం చుట్టూ ఈ ఎన్నికల్ని తిప్పాలన్న బీజేపీ ఉద్దేశం మాత్రం నెరవేరట్లేదు. ఓటర్లను ఈ అంశంపై రెచ్చగొట్టేందుకు బీజేపీ ఎంత ప్రయత్నిస్తున్నా వారు స్పందించడం లేదు. అంతకు ముందు డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల్ని తీసుకొచ్చి ప్రధాని మోడీ సైతం ఇక్కడ ఎంతగా ప్రచారం చేసినా ఫలితం లేదు. ఓటర్లు ఇవేవీ పట్టించుకునే పరిస్ధితుల్లో లేరు. దీని వెనుక కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి.
మధ్యప్రదేశ్ లో ప్రస్తుతం నిరుద్యోగం, ధరల పెరుగుదల, అవినీతి వంటి తీవ్ర సమస్యలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ వీటిపై దృష్టిసారించడంతో ప్రజల నుంచి వారికి మద్దతు లభిస్తోంది. అలాగే కుల గణన కోసం కాంగ్రెస్ ఇస్తున్న హామీ కూడా వారిని ఆకట్టుకుంటోంది. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కులం ప్రధాన అంశంగా మారింది. కాంగ్రెస్, బీజేపీ రెండూ 50 శాతం పైగా ఉన్న బీసీలకు 27 శాతం కంటే ఎక్కువ సీట్లు కేటాయించాయి. అలాగే మధ్యప్రదేశ్‌లోని ముస్లింలు చాలా తక్కువ. దీంతో హిందూత్వ అజెండా క్లిక్ కావడం లేదు. అలాగే బీజేపీ హిందూత్వ అజెండాను న్యూట్రల్ చేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న అధికార వ్యతిరేక సెంటిమెంట్‌ల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ పన్నిన వ్యూహం విఫలమవుతోంది. కానీ బీజేపీ తన కోర్ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది.ఇక్కడ బీజేపీపై కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యంతో విజయం సాధిస్తుందని గతంలో సర్వేలు అంచనా వేసాయి. జీ-సీ4 నిర్వహించిన తాజా సర్వేలో కాంగ్రెస్‌కు 132-146 సీట్లు, బీజేపీకి 84-98 సీట్లు వస్తాయని అంచనా వేసింది.












Click it and Unblock the Notifications