Madras High Court: సెప్టిక్ ట్యాంక్ మరణాలకు బాధ్యులు ఇంటి యజమానులే..
Madras High Court: సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ కార్మికుడు మృతి చెందితే సదరు ఇంటి యజమానులే బాధ్యులని మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాధిత కుటుంబానికి ఇంటి యజమానులే పరిహారం చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది. చెన్నె మున్సిపల్ కార్మికుడి మృతి కేసులో మద్రాస్ హైకోర్టు ఈ కీలక తీర్పును ఇచ్చింది.
కేసు వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని వినాయగపురానికి చెందిన యోగేష్ బాబు తన ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ నిండడంతో 2013 సెప్టెంబర్ లో దానిని క్లీన్ చేయించారు. అందుకోసం చెన్నైమహానగర కార్మికులను పిలిపించి పనులను చేయించారు. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు సోకి మునుసామి అనే కార్మికుడు మృతి చెందారు. దాంతో మునుసామి కుటుంబసభ్యులకు యోగేష్ బాబు రూ.55 వేలు పరిహారంగా ఇచ్చాడు. కానీ మునుసామి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం యోగేష్ బాబే చెల్లించాలంటూ చెన్నై మహానగర కార్పొరేషన్ నోటీసు పంపింది. అయితే యోగేష్ బాబు ఈ నోటీసులను సవాల్ చేస్తూ.. దానికి తానెలా బాధ్యుడ్ని అవుతానని కోర్టులో వాదించారు.

ఈ కేసు విచారణ శనివారం కోర్టు ముందుకు రాగా.. ప్రైవేట్ వ్యక్తుల సెప్టిక్ ట్యాంకులో ప్రమాదం జరిగితే దానికి వారే బాధ్యులని.. బాధిత కుటుంబానికి పూర్తి పరిహారం వారే చెల్లించాలని చెన్నై మహానగర కార్పొరేషన్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ మొత్తాన్ని కార్పొరేషన్ ఒకవేళ బాధిత కుటుంబానికి ఇస్తే.. ఇంటి యజమాని అంత మొత్తాన్ని కార్పొరేషన్ కు చెల్లించాలని.. ఈ మేరకు జీవోను మున్సిపల్ శాఖ జారీ చేసిందని వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. చెన్నై మహానగర కార్పొరేషన్ వాదనలతో ఏకీభవించారు. పిటిషనర్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఓ వ్యక్తి మృతికి బాధ్యుడయ్యారని.. నిబంధనల మేరకు కార్పొరేషన్ నోటీసు పంపిందని.. బాధిత వ్యక్తి కుటుంబానికి చెన్నై కార్పొరేషన్ పరిహారం అందజేసిందని తెలిపింది. కావున ఆ మొత్తాన్ని వసూలు చేయడానికి కార్పొరేషన్ చర్యలు తీసుకోవచ్చని న్యాయస్థానం శనివారం తీర్పు ఇచ్చింది.












Click it and Unblock the Notifications