ఉద్ధవ్‌కు డెడ్‌లైన్: బీజేపీలో జోష్: బల పరీక్షకు ముహూర్తం: అసెంబ్లీ కార్యదర్శికి గవర్నర్ లేఖ
న్యూఢిల్లీ: కొద్దిరోజులుగా మహారాష్ట్రలో కొనసాగుతున్న సంక్షోభ రాజకీయాలు ఇక చివరి దశకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం పతనం అంచుల్లో నిలిచింది. శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వం బల పరీక్షలను ఎదుర్కొనబోతోంది. తన బలాన్ని నిరూపించుకోవడానికి సమాయాత్తమౌతోంది. దీనికి ముహూర్తం కూడా కుదిరింది.

గవర్నర్ లేఖ..
బల నిరూపణ కోసం ప్రత్యేకంగా సభను సమావేశ పర్చాలంటూ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి.. అసెంబ్లీ కార్యదర్శికి కొద్దిసేపటి కిందటే లేఖ రాశారు. ఇదివరకే ఆయన ఈ లేఖ రాసినట్టు వార్తలు వచ్చినప్పటికీ.. వాటిని రాజ్‌భవన్ తోసిపుచ్చింది. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న లేఖను నకిలీగా ప్రకటించింది. ఆ తరువాత కొన్ని గంటలకే మరో లేఖను విడుదల చేసింది రాజ్‌భవన్. మూడు పేజీల ఈ లేఖను మీడియాకు అధికారికంగా విడుదల చేసింది.

రేపే బల పరీక్ష..
బల నిరూపణ కోసం గురువారం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాలంటూ గవర్నర్ కోష్యారి.. కార్యదర్శిని ఆదేశించారు. ఉదయం 11 గంటలకు సభ సమావేశం కావాల్సి ఉంటుందని సూచించారు. సాయంత్రం 5 గంటల్లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ సభ ముగియాల్సి ఉంటుందనీ పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి అసెంబ్లీ భవన సముదాయం వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేయాలని సూచించారు.

బీజేపీలో జోష్..
ఈ పరిణామాలు ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీలో జోష్ నింపాయి. ఏక్‌నాథ్ షిండే వర్గం వైపు శివసేనకు చెందిన మెజారిటీ సభ్యులు ఉండటం వల్ల ఇప్పటికే మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. ఈ తిరుగుబాటు వర్గం ఎవరికి మద్దతు ఇస్తే- ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. ఏక్‌నాథ్ షిండే.. హిందుత్వవాదంతో తిరుగుబాటు లేవదీసిన నేపథ్యంలో.. ఆయన తన తిరుగుబాటు నాయకులతో కలిసి బీజేపీకే మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు.

బీజేపీకే బలం..
మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి ఉన్న బలం 106. ఆ పార్టీకి మద్దతుగా ఉన్న పార్టీలు జేఎస్ఎస్-1, ఆర్ఎస్‌పీ-1, పీజేపీ-2 సభ్యుల మద్దతు ఉంది. దీనికి అదనంగా ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన తిరుగుబాటు సభ్యులు 39 మంది బీజేపీకి మద్దతు ఇవ్వడానికి రెడీ అయ్యారు. వారితో పాటు స్వతంత్ర ఎమ్మెల్యేలు మరో 12 మంది ఏక్‌నాథ్ షిండేలో ఉన్నారు. ఈ 50 మంది కూడా బీజేపీకి మద్దతు ఇవ్వడంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.

మహా అగాఢీ పరిస్థితేంటీ..
ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు తరువాత మహా వికాస్ అగాఢీ సంకీర్ణ కూటమి మైనారిటీలో పడింది. శివసేనకు ఉన్న సభ్యుల సంఖ్య 16కు పడిపోయింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-55, కాంగ్రెస్-44, ఎస్‌డబ్ల్యూపీ-1, సీపీఎం-1, పీడబ్ల్యూపీఐ-1, ఎస్పీ-1, స్వతంత్ర అభ్యర్థి ఒకరు ఈ కూటమి వైపు ఉన్నారు. కాగా బహుజన్ వికాస్ అగాఢీ-3, ఏఐఎంఐఎం-2, మహారాష్ట్ర నవనిర్మాణ్ సమితికి చెందిన ఒకరు తటస్థంగా ఉంటోన్నారు. మజ్లిస్ మాత్రం మహా వికాస్ అగాఢీకి మద్దతు ఇస్తామని ఇదివరకే తెలిపింది.












Click it and Unblock the Notifications