అందుకే యోగి చాలా స్పెషల్: కుంభ మేళాలోనే
Mahakumbh 2025: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా 2025 అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ నెల 13వ తేదీన ఆరంభమైన కుంభమేళాకు దేశం నలుమూలల నుంచీ లక్షలాదిమంది తరలి వెళ్తోన్నారు. గంగా-యమున- సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు.
45 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగుతుందీ మహా కుంభ్. ఈ నెల 20వ తేదీ వరకు 8.80 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. తొలి వారం రోజుల్లోనే ఏడు కోట్ల పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారికంగా వెల్లడించింది.

కాగా- మహా కుంభ మేళా కన్నుల పండువగా కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. త్రివేణి సంగమం ఒడ్డున ప్రత్యేకంగా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ భేటీ ఆరంభమౌతుంది.
ప్రయాగ్‌రాజ్‌లోని అరైల్ ఘాట్.. దీనికి వేదిక. ఇప్పటికే మంత్రివర్గ సమావేశానికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. యోగి ఆదిత్యనాథ్ సహా మొత్తం 54 మంది మంత్రివర్గ సహచరులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నారు. ఇంకాస్సేపట్లో వాళ్లంతా అరైల్ ఘాట్‌కు రానున్నారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, మంత్రులు సురేష్ కుమార్ ఖన్నా, సూర్య ప్రతాప్ షాహి, దేవ్ సింగ్, బేబీ రాణి మౌర్య, జైవీర్ సింగ్, లక్ష్మీ నారాయణ్ చౌదరి, ధరంపాల్, నంద్ గోపాల్ నంది, అనిల్ రాజ్‌భర్ తదితర మంత్రులు ఇందులో పాల్గొంటారు.
సమావేశం ముగిసిన అనంతరం అరైల్ వీఐపీ ఘాట్ నుంచి త్రివేణి సంగమం వరకు బోటులో ప్రయాణిస్తారు. అక్కడ ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. గంగ-యుమన- సరస్వతి నదులకు మంగళహారతి ఇస్తారు. అనంతరం అఖాడా పరిషత్ అధ్యక్షుడు నరేంద్ర గిరి, ఇతర సాధువులతో కలిసి పుణ్యస్నానాలను ఆచరిస్తారు.
దీనికోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటను చేపట్టినటలు ఉత్తరప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. మౌని అమావాస్య నాడు కోట్లాదిమంది పుణ్యస్నానాలను ఆచరించబోతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటోన్నామని, మకర సంక్రాంతి కంటే మెరుగైన ఏర్పాట్లు పూర్తి చేస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications