Maharashtra election news: బరిలో మజ్లిస్ పార్టీ ఒంటరి పోరు.. సత్తా చాటుతుందా..?
Maharashtra Assembly election 2024:అక్టోబర్ 5వ తేదీతో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలపైనే దేశం దృష్టి ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఓ వైపు ఎన్డీయే కూటమి మరో వైపు ఇండియా కూటమిలు తలపడనుండగా... కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావం చూపగల ఏఐఎంఐఎం పార్టీ మాత్రం బరిలో ఒంటరిగా దిగుతోంది. మహారాష్ట్ర ఎంఐఎం చీఫ్ మాజీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ ప్రతిపక్ష పార్టీ అయిన మహా వికాస్ అగాఢీ, వీబీఏ పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఒంటరిగా బరిలో దిగేందుకు నిర్ణయించుకుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ రెండు స్థానాల్లో విజయం సాధించింది.
ఇక ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా మజ్లిస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది. అయితే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రకాష్ అంబేడ్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అగాఢీతో పొత్తు పెట్టుకున్న మజ్లిస్ పార్టీ ఒక సీటును కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది నవంబర్‌లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.మజ్లిస్,వీబీఏ పార్టీల మధ్య చర్చలు విఫలం కావడంతో ఎవరిదారి వారు చూసుకున్నారు. రెండు పార్టీలు ఎలాంటి పొత్తులు లేకుండానే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి.

"ప్రకాష్ అంబేడ్కర్ లేదా మహావికాస్ అగాఢీ పార్టీలు ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాతో లేరు.ఈ రెండు పార్టీలను ఐతే హిందూత్వ పార్టీలు లేదా కాంగ్రెస్ పార్టీలు వాడుకుంటాయి. మొత్తం 200 మంది అభ్యర్థులను బరిలో నిలిపేకన్నా బలమైన అభ్యర్థులను ఆయా నియోజకవర్గాల్లో నిలపడం మంచిది. దళిత సామాజిక వర్గంలో చీలిక వచ్చింది. ఇందులో బౌద్ధులు, హిందూ దళిత వర్గాలుగా ఉన్నారు" అని మజ్లిస్ పార్టీ గుర్తు చేసింది. ప్రకాష్ అంబేడ్కర్ మహారాష్ట్రలోని బౌద్ధ దళితులు మరియు హిందూ దళిత సామాజిక వర్గాలకు నాయకుడిగా ఉన్నారు. అయితే ఇక్కడ హిందూ దళిత సామాజిక వర్గం వారే ఎక్కువగా ఉన్నారని మజ్లిస్ నేత వ్యాఖ్యానించారు.ఇక్కడ అంబేడ్కర్ లేదా వీబీఏ పెద్దగా ప్రభావితం చూపదని అభిప్రాయపడ్డారు.ఎందుకంటే ఇప్పటి వరకు సొంతంగా ఒక్క సీటు గెలిచిన చరిత్ర వీబీఏ పార్టీకి లేదని అన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలున్నాయి.2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాలు గెలిచి అత్యధిక స్థానాలు గెలిచిన ఏకైక పార్టీగా నిలిచింది.మరోవైపు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు వరుసగా 56, 54, 44 స్థానాల్లో విజయం సాధించాయి.మజ్లిస్ రెండు సీట్లలో విజయం సాధించింది.అప్పటికీ బీజేపీతో పొత్తుతో ఉన్న శివసేన పార్టీ అభిప్రాయ బేధాలతో బయటకు వచ్చి కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే గతేడాది షిండే అజిత్ పవార్‌లు వారి వారి ఎమ్మెల్యేలతో కలిసి పార్టీలో చీలక తీసుకొచ్చారు. ఆ వెంటనే బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శన పేలవంగా ఉండటంతో.. మహా వికాస్ అగాఢీ కూటమి పై ఎన్నో అంచనాలున్నాయి.
అయితే మహా వికాస్ అగాఢీ కూటమితో మజ్లిస్ పార్టీకి మంచి సంబంధాలున్నాయి. హైదరాబాదులో పుట్టిన ఈ పార్టీ ప్రస్తుతం తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీతో మంచి సంబంధాలను నడుపుతోంది. ఇది కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. దీని ఆధారంగానే మహావికాస్ అగాఢీతో జతకట్టే అవకాశాలు కూడా ఉన్నాయనే వార్త ప్రచారంలో ఉంది.ఇదిలా ఉంటే ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ మజ్లిస్‌తో జతకట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications