అమరావతి ఎమ్మెల్యేపై వేటు
Maharashtra Assembly elecrtion 2024: ఇంకొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది మహారాష్ట్ర. జార్ఖండ్‌తో కలిసి ఒకేసారి పోలింగ్ జరగాల్సి ఉందిక్కడ. ఇంకో రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది.
మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి మహారాష్ట్రలో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 202. ప్రస్తుతం ఇక్కడ ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ఈ సంఖ్యాబలాన్ని అందుకోలేదు.

ఫలితంగా శివసేన- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ- కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది గానీ అది ఎంతో కాలం మనుగడ సాగించలేకపోయింది. బీజేపీ చేపట్టిన ఆపరేషన్ కమల దెబ్బకు కుప్పకూలింది. శివసేనలో చీలికను తీసుకుని రాగలిగింది. ఉద్దవ్ థాకరే ప్రభుత్వాన్ని విజయవంతంగా కూల్చివేయగలిగింది.
శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని ప్రభుత్వంలో దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తోన్నారు. ఈ సారి సంపూర్ణ మెజారిటీని సాధించాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్నాయి ఆయా పార్టీలన్నీ కూడా.
ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అమరావతికి చెందిన పార్టీ శాసన సభ్యురాలు సులభా ఖోడ్కేపై నిషేధం వేటు వేసింది. పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ బహిష్కరణ ఆరు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఆమెపై వేటు వేసింది.
ఈ మేరకు మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత నానా పటోలే ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ రమేష్ చెన్నితల ఆదేశాల మేరకు ఆమెను పార్టీ నుంచి ఆరు సంవత్సరాల పాటు బహిష్కరించినట్లు వెల్లడించారు. 2019 నాటి ఎన్నికల్లో అమరావతి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు సులభ ఖోడ్కే.












Click it and Unblock the Notifications