అటు పవన్.. ఇటు చంద్రబాబు: ఆ బెల్ట్‌లో ముంచినా తేల్చినా వాళ్లే..
Maharashtra Assembly elections 2024: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు కదనరంగంలోకి దిగాయి. జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తోన్నాయి. పోలింగ్ గడువు సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్‌షోలు, బహిరంగ సభలతో హోరెత్తిపోతోంది మహారాష్ట్ర.
288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అదే నెల 23వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి అదే రోజున కౌంటింగ్ నిర్వహించనుంది ఈసీ. ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది తేలేది అప్పుడే.

అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. భారతీయ జనతా పార్టీ- శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం)- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం)కి చెందిన మహాయుటి, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం)- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం)- కాంగ్రెస్ సారథ్యంలోని మహా వికాస్ అగాఢీ పోటా పోటీగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తోన్నాయి.
ఓటర్లను ఆకట్టుకోవడంలో సర్వశక్తులనూ ఒడ్డుతున్నాయి. మహాయుటి తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ సహా బీజేపీ సీనియర్లందరూ ప్రచారబరిలో దూకారు. మహా వికాస్ అగాఢీ నుంచి మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ఉద్ధవ్ థాకరే హోరాహోరి ప్రచారం సాగిస్తోన్నారు.
ఈ పరిణామాల మధ్య ఎన్డీఏ భాగస్వామ్య పక్షం జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా మహారాష్ట్రలో పర్యటించనున్నారు. మహాయుటి అభ్యర్థుల తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది.
నేడు, రేపు మరాఠ్వాడా, విదర్భ, మహారాష్ట్ర పశ్చిమ ప్రాంత జిల్లాల్లో పర్యటించనున్నారు పవన్ కల్యాణ్. ఆయా ప్రాంతాల్లో తెలుగు వాళ్లు పెద్ద సంఖ్యలో నివసిస్తోండటమే దీనికి కారణం. ఈ రెండు రోజుల్లో ఆయన సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తారు.
అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారబరిలో దిగబోతోన్నారు. తెలుగు బెల్ట్ థానె, భీవండి, వర్లీల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు. శుక్రవారం రాత్రే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తో భేటీ అయ్యారు.
ఈ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరి ముంబైకి చేరకుంటారు. అనంతరం సాయంత్రం థానెలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. థానె.. ఏక్‌నాథ్ షిండే సొంత జిల్లా. ఇక్కడి కొప్రి-పఛ్‌పకడీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీలో నిలిచారు. 2009, 2024, 2019 ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచే ఎన్నికయ్యారు. మరుసటి రోజు భీవండి, వర్లీల్లో ప్రచారం చేస్తారు చంద్రబాబు.
ఆయా ప్రాంతాల్లో తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తోన్నారు. విద్య, ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం ఏపీ, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్లిన వాళ్లు ఆయా ప్రాంతాల్లో స్థిర నివాసం ఉంటోన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించే స్థాయిలో ఉంది తెలుగు వాళ్ల ఓటుబ్యాంక్. అందుకే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను బరిలో దించింది బీజేపీ హైకమాండ్.












Click it and Unblock the Notifications