మనీ లాండరింగ్ కేసు: మాజీ హోం మంత్రి అరెస్ట్: 12 గంటలకు పైగా
ముంబై: మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్ అయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. సుమారు 12 గంటల పాటు విచారించారు. మనీ లాండరింగ్ కేసులో ఇదివరకే ఆయన విచారణను ఎదుర్కొన్నారు. తాజాగా అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ ఉదయం ఆయనను న్యాయస్థానం ముందుకు ప్రవేశపెట్టనున్నారు. కస్టడీకి అప్పగించాలని కోరనున్నారు.
విచారణకు హాజరు కావాలంటూ అనిల్ దేశ్‌ముఖ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పటికే పలుమార్లు సమన్లను జారీ చేశారు. ఆయన దీనికి హాజరు కాలేదు. విచారణకు హాజరు కాలేనందు వల్లే ఆయనను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని అధికారులు వివరించారు. అరెస్ట్ చేయడానికి ముందు ఈడీ అధికారులు ఆయన నుంచి స్టేట్‌మెంట్‌ను తీసుకున్నారు. వాటిని రికార్డ్ చేశారు. అవే రికార్డులను ఇవ్వాళ న్యాయస్థానానికి సమర్పించే అవకాశం ఉంది.

ప్రీవెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద ఇదివరకే అనిల్ దేశ్‌ముఖ్‌ను విచారించారు. వంద కోట్ల రూపాయలను డిమాండ్ చేశారనే ఆరోపణలను ఆయన ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ బదిలీ, అనంతరం ఇన్‌స్పెక్టర్ సచిన్ వాజె అరెస్ట్, తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు అప్పటి హోం శాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అరెస్టుకు దారి తీశాయి. ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తరువాత మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించింది.
పరమ్‌బీర్ సింగ్ బదిలీ వ్యవహారం, అదే సమయంలో దేశీయ దిగ్గజ పారిశ్రామికవేేత్త అనిల్ అంబానీ నివాసం ముందు అనుమానాస్పద స్థితిలో కారు పార్కింగ్ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చాయి. వాటిపై ముంబై పోలీసులు చేపట్టిన విచారణ సందర్భంగా ఈ డొంక అంతా కదలిందనే వార్తలు ఉన్నాయి. వంద కోట్ల రూపాయల వ్యవహారంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదంటూ మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ స్పష్టం చేస్తూ వస్తోన్నారు. దీన్ని రాజకీయ కక్షసాధింపు చర్యగా ఆరోపిస్తోన్నారు అనిల్ దేశ్‌ముఖ్.
Recommended Video
విచారణకు సహకరించకపోవడం వల్లే ఆయనను అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఇవ్వాళ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టిన తరువాత అనిల్ దేశ్‌ముఖ్‌ను కస్టడీకి అప్పగించాలని వారు కోరే అవకాశం ఉంది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన తరువాత న్యాయస్థానం నిర్ణయాన్ని తీసుకుంటుంది. 12 గంటల పాటు ఆయనను విచారించిన అనంతరం సేకరించిన వివరాలతో కూడిన నివేదికను అధికారులు న్యాయస్థానానికి సమర్పిస్తారు.












Click it and Unblock the Notifications