రేవ్ పార్టీ వ్యవహారంలో ఏక్‌నాథ్ ఖడ్సే అల్లుడు అరెస్టు..!
దేశవ్యాప్తంగా రేవ్ పార్టీల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్రలోని పుణెలోని ఖరాడి ప్రాంతంలోని స్టూడియో అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి.. మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. వీరిలో మాజీ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే అల్లుడు ప్రాంజల్ ఖేవాల్కర్ ఉండటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఏడుగురు నిందితులను కోర్టులో హాజరు పరచగా.. ఈ నెల 29వరకు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు వెలువరించింది. ఈ అంశంపై ఎన్సీపీ (శరద్‌పవార్) నేత, మాజీ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే స్పందించారు. పోలీసుల దాడులు రాజకీయ ప్రేరేపితమై ఉండొచ్చని, దీనిపై విచారణ జరిపించాలని కోరారు. ప్రాంజల్ ఖేవాల్కర్ సతీమణి రోహిణి ఖడ్సే ప్రస్తుతం ఎన్సీపీ (ఎస్పీ) మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు.

దాడుల్లో స్వాధీనం చేసుకున్నవి..
డీసీపీ నిఖిల్ పింగలే వివరాల ప్రకారం, ఉదయం 3.30 గంటలకు క్రైమ్ పోలీస్ బృందం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 2.7 గ్రాముల కొకైన్ వంటి మాదకద్రవ్యాలు, 70 గ్రాముల గంజాయి, హుక్కా సెటప్, లిక్కర్, బీర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.
ఈ కేసులో అరెస్టయిన నిందితులు..
ప్రాంజల్ ఖేవాల్కర్
నిఖిల్ పోప్టానీ
సమీర్ సయ్యద్
శ్రీపాద్ యాదవ్
సచిన్ భోంబే
ఈషా సింగ్
ప్రాచీ శర్మ
వీరందరిపైనా మాదకద్రవ్యాల నిరోధక చట్టంలో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసామన్నారు పోలీసులు. నిందితులను వైద్య పరీక్షల కోసం తరలించామని ఇంకా నివేదికలు రావాల్సి ఉందన్నారు.
మరోవైపు హైదరాబాద్ లోని కొండాపూర్‌లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి 11 మందిపై కేసు నమోదు చేశారు. 9 మందిని అరెస్టు చేయడంతో పాటు 6 కార్లు, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సోదాల్లో 2 కిలోల గంజాయి, 50 గ్రాముల ఓజీ కుష్‌డ్రగ్, 11.57 గ్రాముల మ్యాజిక్ మష్రుమ్, 1.91 గ్రాముల చెరాస్ డగ్స్ లభ్యమయ్యాయి. ఈ ఘటనపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications