కౌన్ బనేగా అరబ్‌పతి: మహా ప్రభుత్వంపై మోడీ
బీడ్: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బిజెపిని గెలిపించాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను కోరారు. హర్యానాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తర్వాత ఆయన మహారాష్ట్రంలో శనివారం ప్రచారాన్ని ప్రారంభించారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. గోపీనాథ్ ముండే జీవించి ఉంటే తాను మహారాష్ట్రకు రావాల్సిన అవసరం ఉండేది కాదని ఆయన అన్నారు.
ముండేపై తనకు అపారమైన విశ్వాసం ఉందని, పేదల కోసం పనిచేశారని ఆయన అన్నారు. కాంగ్రెసు, నేషలిస్టు కాంగ్రెసు పార్టీ (ఎన్సీపి) కూటమి ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. గత 15 ఏళ్లలో మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని అడిగారు. రైతులు ప్రయోజనం పొందారా అని ప్రశ్నించారు.

యువకులు, దళితులు, గిరిజనులు ప్రయోజనం పొందారా అని అడిగారు. గ్రామాలు, నగరాలు లబ్ధి పొందాయా, మహిళలు ప్రయోజనం పొందారా అని మోడీ ప్రశ్నించారు. కాంగ్రెసు, ఎన్సీపి కూటమి చీలిపోవడంపై ఆయన వ్యాఖ్యానిస్తూ అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమం నిర్వహిస్తే మహారాష్ట్ర ప్రభుత్వం కౌన్ బనేగా అరబ్‌పతి కార్యక్రమం నడిపించిందని ఆయన చురకలు అంటించారు.
గోపినాథ్ ముండే తన తమ్ముడని, బిజెపి ప్రభుత్వం వస్తే మహారాష్ట్రను రక్షిస్తుందని ఆయన అన్నారు. 60 రోజుల్లో తాను ఏం చేశానని అడుగుతున్నారని, అయితే గత 60 ఏళ్లలో కాంగ్రెసు ఏం చేసిందని మోడీ అడిగారు. చైనా మహారాష్ట్రలో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications