వామ్మో.. పోలియో చుక్కలకు బదులు శానిటైజర్.. 12 మంది చిన్నారులకు అస్వస్ధత, ఎక్కడంటే..
పోలియో మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు డ్రాప్స్ వేస్తున్నారు. సందర్భాన్ని బట్టీ చిన్నారులకు అందజేస్తున్నారు. అసలే కరోనా కరాళ నృత్యం చేస్తోండగా.. కొన్నిచోట్ల అపశృతులు కూడా జరుగుతున్నాయి. పోలియో డ్రాప్స్‌కి బదులు.. చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్ వేసిన ఘటన కలకలం రేపింది. ఆ డ్రాప్స్ తీసుకున్న చిన్నారులు అనారోగ్యానికి గురయ్యారు. మహారాష్ట్రలోని యవత్మాల్‌లో జరిగిన ఘటన చర్చానీయాంశమైంది.
యవత్మాల్‌కి చెందిన ఆరోగ్య కార్యకర్తలు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. చిన్నారులకు పోలియో డ్రాప్స్‌కు బదులు శానిటైజర్ తాగించారు. దీంతో వారు అనారోగ్యం పాలవడంతో ఆసుపత్రికి తరలించారు. ఘాటాంజీ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో ఈ ఘటన జరిగింది. యవత్మాల్ పరిధిలోని ఒక గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. అక్కడి ఆరోగ్య కార్యకర్తలు 12 మంది చిన్నారులకు పోలియో డ్రాప్స్‌కు బదులు హ్యాండ్ శానిటైజర్ తాగించారు. దీంతో వారు కొద్దిసేపటి తరువాత అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆస్పత్రిలో చేర్పించారు.

ప్రస్తుతం ఆ చిన్నారులంతా చికిత్స పొందుతున్నారు. తమ పిల్లలకు పోలియో డ్రాప్స్ వేసిన కొద్దిసేపటి తరువాత వారు వాంతులు చేసుకున్నారని తండ్రి కిషన్ శ్యామ్‌రావు తెలిపారు. ఈ విషయాన్ని ఆరోగ్య కార్యకర్తలకు తెలియజేయడంతో వారు పోలియో డ్రాప్స్‌కు బదులు హ్యాండ్ శానిటైజర్ తాగించామని తెలిపారని చెప్పారు. తరువాత వారు తిరిగి తమ చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేశారన్నారు. విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో ఒక ఆశా కార్యకర్తను సస్పెండ్ చేశారు. జరిగిన ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీచేశారు.