అక్కడింతే! ‘గాంధీ రాష్ట్రపతి, ప్రణబ్ ముఖర్జీ సిఎం’
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు ఎంత దారుణంగా ఉన్నాయో అక్కడి పాఠశాల విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరీక్షిస్తే అర్థమవుతోంది. కనీసం మన దేశ రాష్ట్రపతి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో కూడా తెలియని దుస్థితిలో అక్కడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులున్నారు.
కొందరు 7వ తరగతి చదువుతున్న విద్యార్థులు మహాత్మా గాంధీని రాష్ట్రపతిగా భావిస్తుండగా, మరికొందరు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రణబ్ ముఖర్జీ అనుకుంటున్నారు.
రాష్ట్రంలో మెరుగైన అక్షరాస్యత సాధించిన తొలి జిల్లాగా పేరుపొందిన నర్సింగ్‌పూర్ జిల్లాలోనే ఇలా ఉంటే మిగితా జిల్లా పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

రాష్ట్ర విద్యా వ్యవస్థ పతనానికి ఇవి సూచనలని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా మేలుకుని విద్యా వ్యవస్థలో మార్పు తేవాలని వారు కోరుతున్నారు.
ఉపాధ్యాయులు పాఠశాలలకు ప్రతి రోజూ వచ్చి పాఠాలను బోధించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో వారానికి ఒకసారి మాత్రమే ఉపాధ్యాయులు దర్శనమిస్తున్నారని ఆరోపణలున్నాయి.
కొన్ని పాఠశాలలకు భవనాలు లేకపోవడంతో చెట్ల కిందే విద్యాభ్యాసం కొనసాగుతోంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు తగిన చర్యలు చేపడితే గానీ పరిస్థితి మారేలా కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications