ఢిల్లీ మెట్రో సమీపంలో చెలరేగిన మంటలు .. సర్వీసుకు అంతరాయం ... రంగంలోకి 17 ఫైరింజన్లు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కలింది కంజ్ మెట్రో స్టేషన్ సమీపంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. దీంతో పరిసరాల్లో ఉన్న జనం హడలెత్తిపోయారు. ఫర్నీచర్ మార్కెట్‌లో ఇవాళ ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదని .. ఘటనపై విచారణ జరుపుతున్నామని అధికారులు పేర్కొన్నారు.
మెట్రో స్టేషన్ సమీపంలో ..
ఫర్నీచర్ మార్కెట్ కలింద్ కంజ్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉంది. దీంతో భారీగా మంటలతో పొగ కమ్మంది. దీంతో మాజెండా లైన్ మెట్రో సర్వీసులకు అంతరాయం కలిగింది. ఈ మేరకు ఢిల్లీ మెట్రో సర్వీస్ కూడా ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 5.55 గంటలకు ఫర్నీచర్ మార్కెట్ నుంచి మంటలు చెలరేగినట్టు స్థానికులు తెలిపారు. వారి సమాచారంతో వెంటనే ఘటనాస్థలానికి ఫైరింజన్లు చేరుకున్నాయి. దాదాపు 17 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని పేర్కొన్నారు. అగ్నిప్రమాదంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు. అయితే మంటలు ఎలా చేలరేగాయనే అంశానికి సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు.

సర్వీసులకు అంతరాయం ...
కలింద్ కంజ్ మెట్రో స్టేషన్ సమీపంలో మంట చెలరేగడంతో మాజెంట్ లైన్ గుండా వచ్చే మెట్రో సర్వీసులకు అంతరాయం కలిగింది. ప్రయాణికులు బ్లూ లైన్ గుండా నోయిడా చేరుకోవాలని ఢిల్లీ మెట్రో సర్వీసెస్ ఒక ప్రకటనలో కోరింది. ఉదయం నుంచి కొన్నిగంటల పాటు మాజెంట్ లైన్ స్థంభించిపోయింది. ప్రస్తుతం సేవలను పునరుద్ధరించినట్టు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications