కదలి వచ్చిన మలయాళ సూపర్ స్టార్స్
కేరళ, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఆ తర్వాత కూడా క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తారు ఎన్నికల సిబ్బంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. కేరళ- 140, అస్సాం- 126, పుదుచ్చేరి- 30 స్థానాలకు ఒకేదశలో నేడు పోలింగ్ జరుగుతోంది. మే 4న ఓట్లను లెక్కిస్తారు.
వీటితో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, నాగాలాండ్, త్రిపురల్లో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ కూడా నేడే జరగబోతోంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలికవర్గం నేత అజిత్ పవర్ కన్నుమూతతో ఖాళీ అయిన బారామతి స్థానానికి పోలింగ్ జరుగుతోంది. కర్ణాటకలోని దావణగెరె సౌత్ తో పాటు బాగల్ కోటె నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

కేరళలో 30,495 పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతోంది. రాష్ట్రంలోని అనేక పోలింగ్ బూత్‌ల వద్ద ఉదయం నుంచే ఓటర్ల బారులు తీరారు. ఈ ఎన్నికల్లో మొత్తం 2.71 కోట్ల మంది ఓటర్లు 883 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. 18-19 సంవత్సరాల వయస్సు కలిగిన 4.66 లక్షల మంది కొత్త ఓటర్లపై ఈ ఎన్నికల్లో ప్రత్యేక దృష్టి సారించారు. తీవ్రమైన వేడి వాతావరణం ఉన్నప్పటికీ 85 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ నమోదవుతుందనే అంచనాలు ఉన్నాయి.
ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన స్వగ్రామమైన పినరయిలోని ఆర్‌సి అమల పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతిపక్ష నేత వీడీ సతీశన్, కేపీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్, పణక్కాడ్ సయ్యద్ సాదిక్ అలీ షిహాబ్ తగ్గల్, పీకే కుంజాలీకుట్టి, మంత్రి పీఏ మహ్మద్ రియాస్, ఎన్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ జీ సుకుమారన్ నాయర్ వంటి పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓట్లను వేశారు.
సినీ తారలు మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, ఆయన సతీమణి సుప్రియా మీనన్, ప్రముఖ నటుడు, కేంద్ర మంత్రి సురేష్ గోపి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో ఉన్నారు. మోహన్ లాల్ తిరువనంతపురంలో, పృథ్వీరాజ్ కోచిలో ఓటు వేశారు. త్రిశూర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి సురేష్ గోపీ గురువాయూర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ ముగిసిన వెంటనే పలువురు ఎల్డీఎఫ్ నాయకులు మాట్లాడారు. అధికారంలో కొనసాగుతామని ధీమా వ్యక్తం చేయగా, యూడీఎఫ్ నాయకులు మాత్రం ఈసారి ప్రభుత్వంలో మార్పు ఖాయమని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications