వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మల్లికా సారాభాయ్ : బీజేపీతో విభేదాల వల్లే రామప్ప ఆలయం వద్ద ఆమె నాట్య ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదా, అసలేం జరిగింది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వ గుర్తింపు పొంది ఏడాది పూర్తయిన సందర్భంగా కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయం ప్రాంగణంలో జనవరి 21 న నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశారు.

అయితే పురావస్తు శాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో దాన్ని వరంగల్‌కు మార్చారు.

ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి మల్లికా సారాభాయ్, ఆమె బృందం ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు.

అయితే, మల్లికా సారాభాయ్‌ కి బీజేపితో ఉన్న సైద్దాంతిక ఘర్షణ కారణంగానే కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమానికి అనుమతి రాకుండా చేశారని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ బీవీ పాపారావు ఆరోపించారు.

పాపారావు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేశారు.

కాగా తాము అనుమతులు ఇచ్చామని, నిర్వాహకులే ప్రదర్శనను రద్దు చేసుకున్నారని పురావస్తు శాఖకు చెందిన సిబ్బంది చెప్తున్నారు.

దీంతో ఇప్పుడు ఈ అంశం చుట్టూ చర్చ సాగుతోంది.

మారిన వేదిక

కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్

యునెస్కో గుర్తింపు వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ 'రామప్ప ఫెస్ట్’ పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

కాకతీయుల కళలు, కట్టడాలు పరిరక్షణ కోసం కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ 2009 లో ఏర్పాటైంది.

వరంగల్ కేంద్రంగా ఈ ట్రస్ట్ కొంతకాలంగా పనిచేస్తుంది.

టీఆర్ఎస్ ప్రభుత్వ మాజీ సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీవీ పాపారావు, మరికొందరు ప్రొఫెసర్లు ఈ ట్రస్ట్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

గతంలో రామప్ప , సమ్మక్క , వేయి స్తంభాల గుడి లాంటి పరిరక్షణ, ప్రచారం కల్పించడంలో భాగంగా ట్రస్ట్ వివిధ కార్యక్రమాలు నిర్వహించింది.

హెరిటేజ్ వాక్, యువతకు చారిత్రక ప్రదేశాలపై అవగాహన కల్పించడం, పరిరక్షణ చర్యల్లో వారిని భాగస్వామ్యం చేయడం లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

మల్లికా సారాభాయ్ నాట్య ప్రదర్శన రామప్ప ఆలయం వద్ద ఏర్పాటుకు ట్రస్ట్ గత డిసెంబర్ నుండి ప్రయత్నాలు ప్రారంభించింది.

అయితే అప్పట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో కుదరలేదు.

ఈ వివాదం పై 'కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్’ ఫౌండర్ ట్రస్టీ , రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి.వి.పాపారావు బీబీసీ తో మాట్లాడారు.

''నాట్య ప్రదర్శనకు అనుమతి కోరుతూ మూడు నెలల కిందే అర్కియాలజీ డిపార్ట్మెంట్‌కు దరఖాస్తు చేశాం. అయితే అనుమతి లభించలేదు. మల్లికా సారాభాయ్ కావడం వల్లే పర్మిషన్ ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓరల్ గా చెప్పారు. కళలకు రాజకీయాలకు సంబంధం లేదు. ఉండకూడదు. ఇది దురదృష్టకరం’’ అని అన్నారు.

''ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తో మాకు ఇబ్బంది లేదు. సత్సంబంధాలే ఉన్నాయి. పర్మిషన్ రాకపోవడం తో నృత్య ప్రదర్శన రామప్ప ఆలయం నుండి వరంగల్‌ కు మార్చాం’’ అని పాపారావు వెల్లడించారు.

మల్లికా సారాభాయ్

ఎవరీ మల్లికా సారాభాయ్

శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయీ కూతురుమల్లికా సారాభాయ్. మల్లిక తల్లి మృణాళిని సారాభాయ్ కూడా ప్రముఖ నృత్యకారిణి. ఆమె పలు హిందీ సినిమాల్లోనూ నటించారు.

కూచిపూడి, భరతనాట్యంలో మల్లికా సారాభాయ్ ప్రతిభను గుర్తించి భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్‌తో సత్కరించింది.

వివిధ సామాజిక సమస్యలపై మల్లికా సారాభాయ్ పనిచేశారు. మహిళా సాధికారికత థీమ్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చారు.

అహ్మదాబాద్ కేంద్రంగా తన తల్లి స్థాపించిన 'దర్పణ నాట్య అకాడమీ’ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు.

మల్లికా సారాభాయ్ 2009లో గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎల్‌కే అడ్వాణీపై పోటీ చేసి ఓడిపోయారు.

2002 గుజరాత్ అల్లర్లపై ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు.

రామప్ప ఆలయం

అనుమతి రాకపోవడంపై మల్లిక ఏమంటున్నారు

రామప్ప లో తన నాట్య ప్రదర్శనకు అనుమతి నిరాకరణపై మల్లికా సారాభాయ్ స్పందించారు. ఈ అంశంపై వరంగల్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు.

''శివశక్తి రూపకాన్ని ప్రదర్శిద్దామనుకున్నాను. హిందుత్వ, బీజేపీతో నాకు వ్యక్తిగతంగా ఉన్న రాజకీయ విభేదాాల వల్లే అనుమతి ఇవ్వలేదు. ఇది దురదృష్టకరం. రాజకీయ అభద్రత వల్లే అనుమతి ఇవ్వలేదు. ప్రశ్నించే తత్వాన్ని అనుమతించని వాతావరణంలో ప్రస్తుతం మనం నివసిస్తున్నాం’’ అని అన్నారు.

''రామప్ప ఆలయంలో అనేక నృత్య రూపకాలు చెక్కి ఉన్నాయి. ఇవి కాకతీయ 'జాయపసేనాని’ నృత్యరత్నావళి నాట్యగ్రంథానికి సంబంధించిన అనేక భంగిమలు అని భావిస్తారు.

పేరిణి శివతాండవ నృత్యం తిరిగి ప్రాణం పోసుకోవడానికి ఇక్కడి స్తంభాలపై చెక్కిన నాట్య భంగిమలు ప్రధాన పాత్ర పోషించాయి.

ఖజురహో, కోణార్క్ ఆలయాల వద్ద నిర్వహించే నాట్య ప్రదర్శనలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంటాయి.

వాటి సరసన రామప్పను చేర్చాలన్న ప్రయత్నంలో భాగంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేయాలనుకున్నాం’’ అని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ తెలిపింది.

''ప్రజాస్వామ్య భారత దేశంలో ప్రశ్నించే తత్వం ఇక్కడి వారి డీఎన్ఏ లోనే ఉంది. అది ఉండాలి కూడా. వేదాంతాలు, ఉపనిషత్తులు ప్రశ్నించే తత్వం నుండే వచ్చాయే తప్ప అంధ విశ్వాసాలతో కాదు. దేశాన్ని , రాజ్యాంగాన్ని కుప్పకూల్చాలనుకునే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నా స్వరం వినిపిస్తూనే ఉంటాను. గత 20 ఏళ్లుగా అదే పని చేస్తున్నాను’’ అని మల్లికా సారాభాయ్ అన్నారు.

''రాజకీయ విభేదాలు ఉంటేఉండొచ్చు. రామప్ప నృత్యప్రదర్శనను రాజకీయాలను కలపొద్దు. తెలంగాణలో కేసీఆర్ ను విభేదించే కళాకారులు ఉన్నారు. వారికి రవీంధ్రభారతి లో పర్మిషన్ ఇవ్వబోమంటే సరికాదు కదా? అలాగే రామప్ప ఆలయం వారి చేతిలో ఉందని పర్మిషన్ ఇవ్వకపోవడం సరికాదు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు కోసం 14 ఏళ్లు మేము కష్టపడ్డాం. అలాంటి మాకే పర్మిషన్ ఇవ్వలేదంటే సామాన్యుల సంగతేంటి?’’ అని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ పాపారావు ప్రశ్నించారు.

రామప్ప ఆలయం వద్ద శివమణి ప్రదర్శన

పురావస్తు శాఖ నిబంధనలు ఏం చెప్తున్నాయి

దేశ వ్యాప్తంగా చారిత్రక ప్రాధాన్యం గల ప్రదేశాలను ఇటు కేంద్ర, రాష్ట్ర ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లు పరిరక్షిస్తుంటాయి.

ప్రస్తుతం రామప్ప ఆలయం కేంద్ర పురతత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంది.

ఏడాది కిందట యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు పొందిన తర్వాత రామప్ప ఆలయ ప్రాధాన్యం, ప్రచారం పెరిగాయి. విదేశీ టూరిస్టులు, స్థానిక సందర్శకుల సంఖ్య పెరిగింది.

ప్రముఖ హెరిటేజ్ సైట్ల వద్ద వివిధ సందర్భాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అయితే వాటికి పర్మిషన్ ల విషయంలో ఏఎస్ఐ( ఆర్కియాలజీ శాఖ) షరతులతో కూడిన అనుమతులను జారీచేస్తుంటుంది.

కార్యక్రమ నిర్వహణకు కనీసం 15 రోజుల ముందు పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏ సందర్భంలో, ఏ ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నారో దరఖాస్తులో వివరించాల్సి ఉంటుంది.

''కార్యక్రమ ఉద్దేశం ఏమిటో ఓ స్క్రిప్ట్ రూపంలో పురాతత్వ శాఖ ఉన్నతోద్యోగులకు స్క్రిప్ట్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. కార్యక్రమ నిర్వాహకులు ఎవరు, గెస్ట్ లుగా ఎవరు వస్తున్నారు, నిర్వహణ తేదీ, సమయం లాంటివి దరఖాస్తులో పొందుపర్చాల్సి ఉంటుంది. తమ కార్యక్రమం ద్వారా ఇతరుల మనోభావాలు దెబ్బతినవని, సంబంధిిత ప్రదేశానికి చెడ్డ పేరు తేమని, కార్యక్రమం ద్వారా తప్పుడు సమాచారం ఇవ్వబోమని రాతపూర్వక హామీ ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నింటిని పరిశీలించి నమ్మకం కలిగితేనే పర్మిషన్ ఇస్తారు.’’ అని ఆర్కియాలజీ శాఖ అధికారి ఒకరు బీబీసీ తో చెప్పారు.

గతేడాది రామప్ప యునెస్కో గుర్తింపు పొందిన నాటి నుండి చెప్పుకోదగ్గ సంఖ్యలోనే అక్కడ వివిధ కార్యక్రమాలు జరిగాయి.

హెరిటేజ్ వాక్ వంటి కార్యక్రమాలు సంయుక్తంగా కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ అక్కడే నిర్వహించింది.

గత ఆగస్ట్‌లో డ్రమ్స్ వాద్యకారుడు శివమణి ప్రదర్శన ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.

ఆజాదికా అమృత్ మహోత్సవ్ సందర్భంగా సాంస్కృతిక పర్యాటక శాఖల ఆధ్వర్యలో కార్యక్రమాలు, ప్రదర్శనలు జరిగాయి.

మేం అనుమతులు ఇచ్చాం.. నిర్వాహకులే రద్దు చేసుకున్నారు: ఆర్కియాలజీ శాఖ

ఈ ప్రదర్శనకు తాము అనుమతి ఇచ్చామనీ నిర్వాహకులే దానిని రద్దు చేసుకున్నారని చెబుతున్నారు ఆర్కియాలజీ సిబ్బంది.

పేరు చెప్పడానికి ఇష్టపడని ఆర్కీయాలజీ సిబ్బంది కొందరు బీబీసీతో ఈ అంశం గురించి మాట్లాడారు.

''డిసెంబరు 24న మల్లికా సారాభాయ్ ప్రదర్శనకు నవంబరు 25నే మేం అనుమతిచ్చాం.

అయితే ఆ తరువాత డిసెంబరు 29న రామప్ప ఆలయం వద్ద రాష్ట్రపతి పర్యటన ఖరారు అయింది. దీంతో భద్రతా సిబ్బందికి ముందుగానే దేవాలయ ప్రాంగణాన్ని అప్పగించాల్సి వచ్చింది.

అందుకోసమే ప్రదర్శన మరో తేదీకి మార్చుకోవాలని మేం నిర్వాహకులకు డిసెంబరు 18న సమాచారం ఇచ్చాం. అప్పుడు కూడా రద్దు చేయమనలేదు. కేవలం మరో తేదీన పెట్టుకోమన్నాం. అంతే. ఈలోపు నిర్వాహకులే ప్రదర్శన రద్దు చేసుకున్నట్టు మాకు జనవరి 17న సమాచారం ఇచ్చారు. వాళ్లే రద్దు చేసుకున్నారు’’ అని బీబీసీతో చెప్పారు.

( హైదరాబాద్ నుంచి సతీశ్ బళ్ల ఇన్‌పుట్స్‌తో...)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Mallika Sarabhai: Due to differences with BJP, she was not allowed to perform dance at Ramappa Temple, what happened?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X